Full Style

>

కోమాలోను మెదడు పనిచేస్తుందా...!



సాధారణంగా మనిషి కోమాలోకి వెళ్ళిపోతే ఆలోచించడం, అర్థం చేసుకోవడం, వినడం జరగదని ప్రజలు అనుకుంటుంటారు. కాని తాము జరిపిన పరిశోధనల్లో వారి మెదడు పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. మనిషి కోమాలోనున్నప్పటికీ అతని మెదడు వినడం, అర్థం చేసుకోవడం చేస్తుంటుందని బ్రిటన్, బెల్జియంకు చెందిన పరిశోధకులు తెలిపారు.

ఏదైనా దుర్ఘటనలో వ్యక్తి మెదడుకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతే అందులో చలనం ఉండదనుకుంటుంటారు చాలామంది. కాని ఆ మెదడు ఆలోచిస్తుంటుంది. అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎడ్రియన్ ఆన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2003లో జరిగిన ఓ దుర్ఘటనలో 29 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మెదడును పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఆ దుర్ఘటనలో అతని మెదడు పూర్తిగా దెబ్బతినిందన్నారు. అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో లేస్ ఎఫ్ఎమ్ఆర్ఐ స్క్యాన్ ద్వారా అతని మెదడు పనితీరును తాము పరిశోధించామన్నారు. బయట అతని శరీరంలో ఎలాంటి కదలికలు లేవు, కాని మెదడు మాత్రం నిరంతరం పని చేస్తూనే ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన తెలిపారు.

తాము చేసిన స్క్యానింగ్ ద్వారా తెలిసిన విషయాలేంటంటే అతనిని పరామర్శించేందుకు వచ్చిన వ్యక్తుల ప్రశ్నలకు సమాధానాలు మెదడులో రికార్డు అవుతుంటాయని, అతని అటెండెంట్‌కు తాము సూచించే సలహాలు, మాటలు ఆ వ్యక్తి వింటుంటాడని, దీనికి తగ్గట్టుగానే అతని మెదడు శరీరానికి సంకేతాలు పంపిస్తుంటుందని, దీంతో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు అతని మెదడే సరైన కారణమని చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. వ్యక్తి మెదడులో వచ్చే మార్పులను తమ పరిశోధకుల బృందం చూసి ఆశ్చర్యానికి లోను కాక తప్పలేదని వారు ఒకింత విస్మయం వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు.

Post a Comment

0 Comments