Full Style

>

సూర్యనమస్కారాలు ఆరోగ్య సూత్రాలు , Sun God Namaskaraalu Health hints


సూర్యుడు...చైతన్యానికి ప్రతీక, ఆరోగ్యానికి అధిపతి, క్రమశిక్షణకు మారుపేరు. సూర్యనమస్కారాలతో ఆ మూడూ సిద్ధిస్తాయంటారు సాధకులు.


ఆదిత్యస్య నమస్కారాన్‌ ఏ కుర్వన్తి దినేదినే
జన్మాంతర సహశ్రేషు దారిద్య్ర నోపజాయతే
నమః ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షినే
నమః ప్రత్యక్షదేవాయ భాస్కరాయ నవోనమః

అనేకానేక నమస్కారాలతో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవిత్ర మంత్రాలతో నీ ఘనతను కీర్తిస్తున్నాం. మాకు ఆరోగ్యాన్నివ్వు. ఆయుర్దాయాన్నివ్వు. అలుపెరుగని చైతన్యాన్నివ్వు. ఆధ్యాత్మిక జ్ఞానాన్నివ్వు.
* * *
  

మనిషి కొలిచిన తొలిదేవుడు భానుడు. ఆ లేలేత కిరణం, ఆ ప్రచండ భానుతేజం, ఆ సంధ్యాసౌందర్యం...ప్రతీదీ ఓ అద్భుతమే! అందుకే ఏడుగుర్రాల తేరులో వూరేగించారు. 'ఆదిత్య హృదయం'తో కీర్తించారు. కోణార్కు, అరసవిల్లి ఆలయాలు కట్టించారు. రుగ్వేదంలో సూర్యుడిని కీర్తిస్తూ చాలా రుక్కులే ఉన్నాయి. భానుకిరణాలు బలహీనతల్ని నివారిస్తాయనీ రోగాల్ని నయంచేస్తాయనీ దుష్టశక్తుల్ని తరిమికొడతాయనీ ఉపాసకులను కవచంలా రక్షిస్తాయనీ వేనోళ్ల కొనియాడారు. పురాణాలు కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చాయి. రామాయణంలో మహాబలవంతుడైన రావణుడిని జయించడానికి అగస్త్యమహాముని రాముడికి 'ఆదిత్య హృదయం' బోధించాడు. 'మహాభారతం'లో అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చింది సూర్యుడే. 'గీత'లో కృష్ణుడు 'నక్షత్ర రాశిలో నేను సూర్యుడిని' అని ప్రకటించాడు.

పన్నెండు భంగిమలు...
సూర్యారాధనలో నమస్కారాలే ప్రధానం. ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా వెుత్తం పన్నెండున్నాయి. ఇందులో ఏడు వైవిధ్యమైనవి. మిగిలిన అయిదూ వాటిలోంచే పునరావృతం అవుతాయి. నిటారుగా నిలబడటం, ముందుకు వంగడం, వెనక్కి వంగడం...ఇలా ప్రతి కదలికా శరీరంలోని ఏదో ఓ భాగం మీద ప్రభావం చూపుతుంది. పన్నెండు నమస్కారాలూ అయ్యేసరికి ఆ చైతన్యం శరీరమంతా విస్తరిస్తుంది. ప్రతి భంగిమా సూర్యమంత్రంతో వెుదలవుతుంది. దీనికీ ఓ కారణం ఉంది. మన పెద్దలు మంత్రానికి అపారమైన శక్తి ఉందని నమ్మారు. అందులోనూ, ప్రతి సూర్యమంత్రానికీ జోడించే 'ఓం'కారం మహా మహిమాన్వితమని భావించారు. సూర్యనమస్కారాలు చేస్తున్నప్పుడు శరీరం మీద ఎంత శ్రద్ధపెడతావో, మనసు మీదా అంతే ధ్యాస ఉండాలి. బాహ్య చైతన్యంతో ప్రారంభించి, అంతః చైతన్యాన్ని సాధించడమే సూర్యనమస్కారాల లక్ష్యం.

పన్నెండు ఆసనాలకు ఆ పన్నెండు మంత్రాలే ఎందుకన్న ప్రశ్నకూ యోగులు సమాధానం చెప్పారు. జ్యోతిషం ప్రకారం...సూర్యుడు రాశిచక్రంలోని పన్నెండు స్థానాల్లో సంచరిస్తాడు. ఆయా స్థానాల్లో ప్రవేశించగానే సూర్యుడి ముఖ కవళికల్లో వచ్చే మార్పులను బట్టి... పన్నెండు పేర్లూ వచ్చాయి. 'మిత్రాయ నమః' అంటూ సూర్యుడిని జగత్తుకంతా స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా కీర్తిస్తాం. 'రవయే నమః' అంటే ప్రకాశించేవాడని అర్థం. 'సూర్యాయ నమః' అన్న మంత్రం... చైతన్య స్వరూపుడిగా కొనియాడుతుంది. 'భానవే నమః'...అంధకారాన్ని తొలగించేవాడికి ఇవే మా నమస్కారాలు. అజ్ఞానాన్నీ అనారోగ్యాల్నీ దూరంచేసేవాడని కూడా అంతర్లీన భావం. ఇలా పన్నెండు మంత్రాలకూ పన్నెండు అర్థాలున్నాయి.

సూర్యనమస్కారాలు శరీరానికి చైతన్యాన్ని ఇస్తాయి. క్రమబద్ధమైన శ్వాస మనసును ప్రభావితం చేస్తుంది. ఓంకారంతో పలికే సూర్యమంత్రాలు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే... శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం! సూర్యనమస్కారాల్లో ఈ మూడూ ఉన్నాయి.

శుభోదయం...
తెలతెలవారుతూ ఉంటుంది. కిలకిలమంటూ పక్షులు గూట్లోంచి బయటికొస్తాయి. లేతవెుగ్గలు సుకుమారంగా విచ్చుకుంటాయి. వెుక్కలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతికే ఓ కొత్తకళ వచ్చేస్తుంది. అర్ధరాత్రి పార్టీలతో అపరాత్రి విందులతో అలసిసొలసిన ఆధునిక మానవుడు మాత్రం, అలారమ్‌ వోగినా పట్టించుకోడు. కోడి 'కొక్కొరకో' అంటూ అరిచిగీపెట్టినా స్పందించడు. ఆ అపసవ్య జీవనశైలితో ఆరోగ్యం నాశనమైపోతుంది. సూర్యనమస్కారాల్ని జీవితంలో భాగం చేసుకుంటే...అన్నిటికంటే ముందు బద్ధకం వదిలిపోతుంది. తెల్లవారుజామునే నిద్రలేస్తాం. బాలభానుడి దర్శనమే ఓ దివ్యానుభూతి. బంగారు వన్నెలో మెరిసిపోతుంటాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నప్పుడు...ఎక్కడలేని ప్రశాంతత. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యనమస్కారాల్లో - ఓ రూపమంటూ లేని ఆదిత్యుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సాధన మనలోని సృజనాత్మకతను ఇనుమడింపజేస్తుంది. సూర్యనమస్కారాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆలోచనల్లేని స్థితిని సాధించే క్రమంలో... తూనీగల్లా వచ్చిపోయే ఆలోచనల్ని ఎలాంటి స్పందనా లేకుండా, ఏ మాత్రం భావోద్వేగాలకు లోనుకాకుండా అచ్చంగా ఓ ప్రేక్షకుడిలా గమనిస్తాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లనూ సమస్యలనూ ఎదుర్కోడానికి అవసరమైన శక్తి అలా మనకు ఒంటబడుతుంది. మంత్రం మన ఉచ్చరణ దోషాల్ని పరిహరిస్తుంది. తడబడకుండా సూటిగా భావాల్ని వ్యక్తం చేయగల నైపుణ్యాన్నిస్తుంది. కార్పొరేట్‌ ప్రపంచంలో పట్టాల కంటే గొప్ప అర్హత ఇది.

వూబకాయం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు... ఆధునిక జీవితంలోని ప్రతి ఆరోగ్య సమస్యకీ సూర్యనమస్కారాల్లో పరిష్కారం ఉంది. పొద్దున్నే తూర్పు దిశగా నిలబడినపుడు శరీరంలోకి ప్రవేశించే విటమిన్‌-డి ఎముకల్ని శక్తిమంతం చేస్తుంది. ఆ కిరణాల ప్రభావంతో కొన్నిరకాల చర్మరోగాలు కూడా దూరమవుతాయని నిపుణులు నిర్ధరించారు. నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నవారికి సూర్యదర్శనం చాలా మంచిది. సూర్యనమస్కారాల్లో భంగిమ ఎంత ముఖ్యవో, శ్వాసా అంతే ముఖ్యం. క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మలిన రక్తం తొలగిపోతుంది. అన్ని భాగాలకూ చక్కని రక్తప్రసరణ జరుగుతుంది. అలసట గాలికెగిరిపోతుంది.

సూర్యనమస్కారాల్లోని పన్నెండు ఆసనాలూ అపారమైన ప్రయోజనాల్ని కలిగించేవే. మొదటి ఆసనం...ఏకాగ్రతనిస్తుంది. రెండో ఆసనం... పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వెన్నులోని నరాలను శక్తిమంతం చేస్తుంది. చేతులకూ భుజాలకూ సత్తువనిస్తుంది. వూపిరితిత్తుల్లోని గదులను విశాలం చేస్తుంది. మూడో ఆసనం...ఉదర సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నాలుగో ఆసనం...కాళ్లలోని కండరాలకు బలాన్నిస్తుంది. ఐదో ఆసనం...రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. ఆరో ఆసనంలో ఛాతీ విశాలమవుతుంది. ఏడో ఆసనంలో బుద్ధివికాసం కలుగుతుంది. పునరావృతమయ్యే ఐదు ఆసనాలూ అదనపు ప్రయోజనాలను జోడిస్తాయి.

సూర్యనమస్కారాలు ముగిస్తే ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వసంచలనాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం...చేసినట్టే. అంటే, యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు మన ఖాతాలో పడ్డట్టే. వాత, పిత్త, కఫ...ఈ మూడూ సమతౌల్యంగా ఉంటే, ఎలాంటి సమస్యలూ రావని ఆయుర్వేదం చెబుతుంది. సూర్యనమస్కారాలతో ఆ సమస్థితిని సాధించవచ్చు.

సూర్యనమస్కారాలు ఆధ్యాత్మిక సాధకులకూ దిశానిర్దేశం చేస్తాయంటారు యోగాచార్యులు. మన శరీరంలోని నాడులతో, గ్రంధులతో ముడిపడి వెుత్తంగా ఏడు శక్తికేంద్రాలున్నాయి...మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం వాటి పేర్లు. సూర్యనమస్కారాలతో ఏకాగ్రత కుదురుతుంది. దాంతోపాటే చక్ర కేంద్రాల్లో చైతన్యం కలుగుతుంది. అదే, కుండలిని జాగృతికి దారిచూపుతుంది. అంతకుమించిన ఆధ్యాత్మిక ఉన్నతి ఇంకెక్కడుంటుంది?అదే ఆనందం, బ్రహ్మానందం, మహదానందం!

మహాప్రసాదం!
రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలోని 35 నుంచి 40 శాతం కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. మిగతావన్నీ పనీపాటా లేకుండా బద్ధకంగా ముడుచుకుని పడుంటాయి. పన్నెండు సూర్యనమస్కారాలతో 95 నుంచి 97 శాతం కండరాల్లో కదలిక వస్తుంది. మరుసటి రోజు 'రీఛార్జ్‌' చేసేదాకా అవి చురుగ్గా ఉంటాయి. సూర్యనమస్కారాల ప్రభావాన్ని తెలుసుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయంలో లోతైన పరిశోధనలు చేశారు. సూర్యనమస్కారాల్ని ఆరు రౌండ్లతో ప్రారంభించి...క్రమక్రమంగా ఇరవై నాలుగుదాకా తీసుకెళ్లడం ద్వారా... సాధకుల ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పులను నవోదు చేశారు. ఇవి శ్వాసవ్యవస్థ మీద చాలా ప్రభావం చూపాయని నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. మునుపటి కంటే ఎక్కువ సేపు పనిచేయగల సత్తువ వచ్చింది. శరీర వ్యవస్థ మరింత శక్తిమంతమైంది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ పరిశోధనలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. సూర్యనమస్కారాల వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లోని అడ్డంకులు తొలగిపోవడం గమనించారు పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం ప్రతినిధులు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పుణెశాఖ ప్రతినిధి డాక్టర్‌ దిలీప్‌ శార్దా ఐదువందల మందిపై తాను జరిపిన అధ్యయన ఫలితాల్ని పత్రికాముఖంగా వెల్లడించారు. ముఖ్యంగా ముప్ఫై నుంచి ఎనభై సంవత్సరాలవారిలో... రక్తపోటు క్రమబద్ధం అయినట్టు నిర్ధరించారు. కొలెస్ట్రాల్‌, బ్లడ్‌షుగర్‌, కొవ్వు...తదితరాల్లో ఆరోగ్యకరమైన తేడాను గుర్తించినట్టు చెప్పారు. అమెరికాలోని శాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీలోనూ కొన్ని అధ్యయనాలు జరిగాయి. వృద్ధాప్యాన్ని మందగింపజేయగల సామర్థ్యం సూర్యనమస్కారాలకు ఉందని విశ్వవిద్యాలయ వర్గాలు ప్రకటించాయి. జీవక్రియతో పాటు గుండె పనితీరు మీద కూడా వీటి ప్రభావం ఉంటుందని కె.బి.గ్రంట్‌ అనే హృద్రోగవైద్యుడు గుర్తించాడు. పొట్టచుట్టూ పేరుకుపోయే కొవ్వును సూర్యనమస్కారాలు సులభంగా కరిగిస్తాయని సాధకులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. 'జీవన తత్వయోగ' సంస్థ ప్రాచీనమైన పద్ధతికి చిన్నచిన్న మార్పులు చేసి డైనమిక్‌ సూర్యనమస్కారాల్ని రూపొందించింది. దీనివల్ల రెండుమూడుసార్లు సాధన చేసినా, అంతకు రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని పరిమితులూ
సూర్యనమస్కారాలు ఎప్పుడు పుట్టాయి? ఆవిష్కర్త ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పతంజలి యోగసూత్రాల్లో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. గత శతాబ్దంలో ఔంధ్‌ రాజైన భవన్‌రావు ప్రాచుర్యంలోకి తెచ్చినట్టు ఓ కథనం. ఆయన లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న రోజుల్లో వాటివల్ల తానెంత ప్రయోజనం పొందిందీ ఓ రచయితకి యథాలాపంగా చెప్పారట. వాటి ఆధారంగా 'టెన్‌ పాయింట్‌ వే టు హెల్త్‌' అనే పుస్తకం వచ్చిందనే వాదన ఉంది. ఆ అభిప్రాయాన్ని కాదనలేం. కానీ, భవన్‌రావు సూర్యనమస్కారాల సృష్టికర్త కాకపోవచ్చు. మహాఅయితే, వాటి ప్రచారానికి కృషిచేసి ఉండవచ్చు. వేదకాలం నాటికే అవి ఉనికిలో ఉన్నాయి. ఇప్పుడు, సూర్యనమస్కారాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యాయి. జపాన్‌లో పన్నెండు ముద్రల్లోంచి ఏడింటిని తీసుకుని సాధన చేస్తున్నారు. వివిధ దేశాల్లోని యోగా కేంద్రాల్లో సూర్యనమస్కారాల్ని కూడా నేర్పుతున్నారు.

వీటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు. కొన్ని అపోహలూ ఉన్నాయి. సూర్యోదయ సమయంలో...తూర్పువైపుగా నిలబడి చేయడమే ఉత్తమం. సాధ్యం కాకపోతే, సూర్యాస్తమయంలో అయినా ఫర్వాలేదు. మిట్టమధ్యాహ్నవో, అర్ధరాత్రో చేయడం మంచిది కాదు. చాపకానీ దుప్పటి కానీ పరుచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. వదులైన దుస్తులు వేసుకుంటే మంచిది. కాలకృత్యాలు ముగించుకున్నాకే ప్రారంభించాలి. ఖాళీ కడుపుతో చేయాలి. వెంటనే, భోజనం కూడదు. కాస్త సేదదీరాక మంచినీళ్లో పళ్లరసవో తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన లేదు. వెుక్కుబడిగా ఒకటిరెండుసార్లు చేయడం వల్ల లాభం ఉండదు. అలా అని, శరీరాన్ని హింసిస్తూ అదేపనిగా చేయడమూ నిష్ఫలమే. వయసు, ఆరోగ్య పరిస్థితి, అందుబాటులో ఉన్న సమయం...వంటి అంశాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తీవ్రస్థాయిలో రక్తపోటు ఉన్నవారు, హృద్రోగులు, ఆర్థరైటిస్‌, హెర్నియా తదితర సమస్యలతో బాధపడుతున్నవారు దూరంగా ఉండటమే మేలు. వెన్నెముక సమస్యలున్నవారు నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. గర్భిణులు దాదాపు నాలుగు నెలల దాకా చేయవచ్చు. దీనివల్ల సుఖప్రసవం జరుగుతుంది. అయితే, వైద్యుల సలహా తప్పనిసరి. ప్రసవమైన నలభైరోజుల తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు. ఇక, ఎనిమిదేళ్లలోపు పిల్లలు ప్రత్యేకంగా సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వయసులో ఆటపాటల్ని మించిన వ్యాయామం ఏముంటుంది? ఆరోగ్యవంతులైన వృద్ధులకూ ఎలాంటి పరిమితుల్లేవు. మహిళలకు నెలసరి రోజుల్లో తీవ్ర రక్తస్రావం వంటి సమస్యలుంటే, ఆ మూడునాలుగు రోజులూ ఆపేయడమే మంచిది.

సూర్యనమస్కారాలు చేస్తున్నప్పుడు...ఒత్తిడి వద్దు, తొందరవద్దు. ప్రశాంతంగా చేయాలి. శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వాలి. ఆలోచనలకు పగ్గాలు వేయాలి. సూర్య మంత్రం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆ తేజస్సును మనలో ఆవాహనం చేసుకోవాలి. క్రమంగా, సూర్యనమస్కారాలకు ప్రాణాయామాన్ని కూడా జోడిస్తే మరీ మంచిది.

సూర్యనమస్కారాలు ఖరీదైన వ్యవహారమేం కాదు. ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పన్లేదు. ఓ వారవో, పదిరోజులో సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు. జీవితాంతం సాధన చేసుకోవచ్చు. యోగాలో ఉన్నట్టు వందలకొద్ది ఆసనాలూ ఉండవు. తికమకపడాల్సిన అవసరం లేదు. కొన్నింటినే పునరావృతం చేస్తూ వెళ్లడమే కాబట్టి, గుర్తుంచుకోవడం పెద్ద సమస్యేం కాదు. 'మాకు తీరిక లేదు'...అని వాదించేవారికి ఒకటే ప్రశ్న? 'రేపు ఏ గుండె జబ్బో వస్తే (రాకూడదనే కోరుకుందాం), సర్జరీ చేయించుకోడానికి కూడా టైం ఉండదా? ఏ రక్తపోటో చక్కెర వ్యాధో వేధిస్తే (వేధించకూడదనే ఆశ), డాక్టర్ల చుట్టూతిరగడానికి కూడా టైం ఉండదా?'. కొంపలేం మునిగిపోవు. రోజూ ఓ అరగంట కేటాయించినా చాలు. ప్రారంభంలో కాస్త నిదానంగా సాగినా, సాధన పెరిగాక వేగం పుంజుకుంటుంది. సూర్యనమస్కారాలు జీవితంలో భాగమైపోతాయి. సూర్యుడికి 'శుభోదయం' చెప్పడంతోనే మీ దినచర్య వెుదలవుతుంది.
* * *
యోగా గురువుగారిని అత్యాధునికమైన జిమ్‌కు తీసుకెళ్లాడు ఓ యువకుడు. అక్కడున్న పరికరాలన్నీ చూపిస్తున్నాడు.
'ఇది ఛాతీ వ్యాయామానికి సంబంధించింది...'
'ఇది చేతులకు సంబంధించింది'
'ఇది పొత్తికడుపు కోసం...'
అలా సాగుతోంది పరిచయం.
చివర్లో అడిగారు గురూజీ... 'ఇంతపెద్ద జిమ్ములో వెుత్తం శరీరానికంతా పనికొచ్చే పరికరం ఒక్కటీ లేదా?'.
బిక్కవెుహం వేశాడు సిక్స్‌ప్యాక్‌ కుర్రాడు.
మొత్తం శరీరానికే కాదు, మనసుకూ బుద్ధికీ కూడా ఒకటే వ్యాయామం...అవే సూర్యనమస్కారాలు!

వెలుగుల దేవుడికి వందనం
సూర్యనమస్కారాలు వెుత్తం పన్నెండు. ఎనిమిదో ఆసనం తర్వాత మళ్లీ నాలుగు, మూడు, రెండు, ఒకటి ఆసనాలే పునరావృతం అవుతాయి. ప్రణామస్థితి నుంచి ప్రణామస్థితి దాకా ఒక రౌండు. నిపుణుల పర్యవేక్షణలో సాధన ప్రారంభించడం మంచిది.



 




Post a Comment

0 Comments