స్వైన్ ఫ్లూ (swine flue) అంటే ఏమిటి ?: పందులు వలన కలిగే ఒక రకమైన ఉపిరితిత్తుల వ్యాధి . . . ఇది స్వైన్ ఇంఫ్లు ఎంజా --H1N1 వైరస్ కారణము గా పందులలో తరచుగా వచ్చే వ్యాధి . గాలి ద్వార జంతువుల నుండి మనుషులకు .. మనిషి నుండి మనిషికి సులువుగా వ్యాప్తి చెందుతుంది . ఇది మొదటి సారిగా అమెరికా లో ఏప్రిల్ 2009 లో కనుగొనబడినది .
స్వైన్ ఫ్లూ అంటు వ్యాదా ? ఎలా వ్యాపిస్తుంది ?:
అవును ఇది అంటు వ్యాధే . గాలి ద్వారా దగ్గు , తుమ్ము , ఉపిరి , చేతులతో ముట్టుకోవడం (touching) వలన మనిషి నుండి మనిషికి వస్తుంది . బయట ఈ క్రిములు 2 నుండి 3 గంటలు బ్రతికి ఉంటాయి . వ్యాధి ప్రభలి ఉన్న ప్రదేశాలలో సంభందిత వ్యక్తులు వాడే సామానులను తాకకూడదు . వైరస్ సంఖ్య (వైరస్ లోడ్) ను తగ్గించడానికి ముక్కు మాస్క్ లు ధరించాలి . దగ్గేటపుడు , తుమ్మేటపుడు గుడ్డ అడ్డుపెట్టుకోవాలి . జబ్బుతో భాదపాడు తున్నవారు వారివారి పనులకు వెళ్ళకుండా ప్రత్యేకము గా (ఐసోలేట్-isolate) అయిఉండాలి .
లక్షణాలు ఏమిటి ? : సాదారణ ఫ్లూ జలుబు లక్షణాలు గానే ఉంటాయి .
చలి తో జ్యరము ,
దగ్గు , గొంతు నొప్పి,
వాళ్ళు నొప్పులు ,
తలనొప్పి ,
నీరసము గా ఉండడము .
కొంతమందికి వాంతి , నీళ్ళ విరోచనాలు ఉండవచ్చును ,
ఎలా నిర్ధరిస్తాము ?:
రెగ్యులర్ ఫ్లూ లాగానే ఉన్నందున ఉపిరి తిత్తుల నుండి తీసుకున్న స్పెసిమన్ (కెల్లా , ఉమ్మి , మూకస్ ద్రవాలు) లేబరిటరి లో తనికీ చేయడం వలన మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించగలము . ఒక రోజు నుండి ఇదు రోజు లలో ఈ వైరస్ లు ఎక్కువగా టెస్టింగ్ కి దొరుకు తాయి .
ఒక వ్యక్తీ ఎంతకాలము ఈ జబ్బును వ్యాప్తి చేస్తాడు ? :
1 రోజునుండి 7 రోజులు వరకు ఆ తరువాత ఈ వ్యాధి తీవ్రత తగ్గి పోవును .
ఈ వ్యాధికి వ్యాక్సిన్ లబిస్తుందా ?:
ఈ వైరస్ కొత్తది అయినందున ఇంకా టీకా మందు తాయారు కాలేదు .. సాధారణ జలుబు కి , ఇతర ఇంఫ్లుఎంజా కి పనిచేసే వ్యాక్సిన్ పనికి రాదు . ఒక సం. కాలము లో వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలున్నాయి.
చికిత్స (ట్రీట్మెంట్) :
ఇది శరీర వ్యాధి నిరోధక శక్తి పై ఆధారపడి దానంతట అదే వారం .. పది రోజులలో తగ్గిపోతుంది . తాత్కాలిక భాధలు నివారణకు
జ్వరానికు : పేరా సిటమాల్ మాత్రలు 1 మాత్ర రోజుకు మూడు సార్లు
జలుబుకి .. జలుబు మందు , దగ్గుకి ... దగ్గు మందు వాడుతూ వ్యాధి తీవ్రతను బట్టి
Oseltamivir(Tamiflu) కాని Zanamivir (Relanza) కాని జబ్బు నయము కావడానికి , వ్యాధి నిరోధించడానికి వాడాలి . ఎంత తొందరగా వైద్యం మొదలపెడితే అంత మంచిది .
విశ్రాంతి , మంచి ఆహారము , విటమిన్లు తీసుకోవాలి .
ఎవరికి ప్రమాదకరము :
65 సం .దాటినవారికి ,
5 సం . లోపు పిల్లలకు ,
గర్భిణీ స్త్రీలు కు ,
బాలింతరాల్ల కు ,
మధుమేహము , ఉబ్బసము , గుండె జబ్బులు , మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి ,
గర్భిణుల్లో స్వైన్‌ఫ్లూ కలవరం Updated on 26/07/2010.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయిగానీ.. ఈ దఫా వైరస్ విజృంభణ తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో మరణించిన 10 మందిలో.. ఆరుగురు మహిళలే కావటం ఆందోళనకరమైన విషయమైతే.. మళ్లీ ఈ ఆరుగురిలోనూ కూడా నలుగురు గర్భిణులు, ఇద్దరు బాలింతలుండటం పెద్ద కలకలాన్ని రేపుతోంది.
మృతుల్లో గర్భిణులు, లేదంటే ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన బాలింత తల్లులే ఎక్కువగా ఉండటం తప్పకుండా గుర్తించాల్సిన అంశం! ఈ నేపథ్యంలో వైద్యులందరూ గర్భిణులను, బాలింతలను చూసేటప్పుడు వారికి స్వైన్‌ఫ్లూ లక్షణాలేమైనా ఉన్నాయా? అన్నదీ చూడాలని వైద్య విభాగం సూచిస్తోంది.
అపురూపంగా చూసుకోవాల్సిన గర్భిణులకు.. స్వైన్‌ఫ్లూ వస్తే ఏం చెయ్యాలి?
సాధారణ జనాభాకు వస్తే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదన్న దానిపై స్పష్టత ఉంది, దానిపై ఇప్పటికే ఎంతో ప్రచారం కూడా జరిగింది. కానీ గర్భిణులకు వస్తే ఏం చెయ్యాలన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా కేసుల నేపథ్యంలో దీనిపై రకరకాల అనుమానాలు, ఆందోళనలు, అపోహలు పెరుగుతున్నాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనబడితే గర్భిణులకు 'టామిఫ్లూ' ఇవ్వచ్చా? ఇచ్చినా బిడ్డకుగానీ, తల్లికిగానీ ఎటువంటి హానీ ఉండదా? గర్భిణులకు స్వైన్‌ఫ్లూ టీకా ఇస్తే ఫర్వాలేదా? సాధారణ ప్రజానీకంలోనే కాదు.. వైద్య వర్గాల్లో కూడా దీనిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి.
గర్భిణులకు స్వైన్‌ఫ్లూ ముప్పు ఎక్కువా?
గర్భిణులకు సహజంగానే 'రోగ నిరోధక శక్తి' బాగా తక్కువగా ఉంటుంది. గర్భం ధరించిన తర్వాత స్త్రీ శరీరంలో హార్మోన్లపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల వీరు రకరకాల ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువ. వేగంగా విజృంభించే 'స్వైన్‌ఫ్లూ' వంటి వైరల్ వ్యాధులూ ఇందుకు మినహాయింపేం కాదు. పైగా స్వైన్‌ఫ్లూ వస్తే... గర్భిణులపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. అందుకే అసలు స్వైన్‌ఫ్లూ దరిజేరే అవకాశమే లేకుండా గర్భిణులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఒకవేళ ఫ్లూ జ్వర-లక్షణాలు కనబడితే తక్షణం వైద్యులను సంప్రదించటం కూడా.. అంతే అవసరం.
* బాలింతలు కూడా... కేవలం గర్భిణులే కాదు, ఇటీవలే ప్రసవించిన బాలింతలు, గర్భస్రావాలైన (అబార్షన్లు) స్త్రీలలో కూడా 2 వారాల వరకూ రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. కాబట్టి స్వైన్‌ఫ్లూతో వీరికీ సమస్యలు ఎక్కువేనని గుర్తించాలి.
* గర్భిణీలలో స్వైన్‌ఫ్లూ వస్తే కనిపించే లక్షణాలేమిటి?
స్వైన్‌ఫ్లూ లక్షణాలన్నీ సాధారణ ఫ్లూ జ్వర లక్షణాల్లాగే ఉంటాయి. ఒళ్లు కాలిపోయే జ్వరం, దానితో పాటుగా విపరీతమైన అలసట, పొడి దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారటం, ఆకలి తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటివే ఉంటాయి.
* గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే.. దానికి సంబంధించిన దుష్ప్రభావాలు తీవ్రస్థాయిలో ఉంటాయా?
చాలామంది గర్భిణులు, బాలింతల్లో స్వైన్‌ఫ్లూ మరీ అంత తీవ్రంగా ఏమీ ఉండదు. మిగతా అందరిలో మాదిరే.. వ్యాధి తీవ్రత ఓ మోస్తరుగా ఉండి, వీరు కూడా ఓ వారంలో కోలుకుంటారు. అయితే ఈ సమయంలో వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి కొందరిలో న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, ఒంట్లో నీరు తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్ ఒళ్లంతా వ్యాపించటం(సెప్సిస్), ఫ్లూ మరింత తీవ్రతరమైతే స్పృహ తప్పటం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశమూ ఉంటోంది. ముఖ్యంగా- గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే సాధారణ స్వైన్‌ఫ్లూ రోగుల కంటే వీరిని ఐసీయూ (ICU)లో ఉంచి చికిత్స చెయ్యాల్సిన అవసరం పదిరెట్లు ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. నెలలు నిండిన వారిలో ఈ దుష్ప్రభావాల బెడద మరీ ఎక్కువ. అందుకే గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
* గర్భిణికి 'స్వైన్‌ఫ్లూ' వచ్చిందా.. అనుమానంగా ఉంది. ఏం చెయ్యాలి?
ఫ్లూజ్వర లక్షణాలు కనబడుతూనే గర్భిణులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వెంటనే వైద్యులు అది 'స్వైన్‌ఫ్లూనా?' అన్నది నిర్ధారించేందుకు రక్తం సేకరించి పరీక్షకు పంపిస్తారు. అయితే పరీక్ష ఫలితం వచ్చి, అది నిర్ధారణ అయ్యే వరకూ చికిత్స చెయ్యకుండా ఆగాల్సిన పని లేదు. వెంటనే చికిత్స మొదలుపెట్టెయ్యటం అవసరం. పరీక్షా ఫలితం రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ వేచి చూడటం.. గర్భిణుల విషయంలో శ్రేయస్కరం కాదు. గర్భిణులకు స్వైన్‌ఫ్లూ దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి పరిస్థితి అంత వరకూ వెళ్లక ముందే.. అనుమానించిన వెంటనే చికిత్స ఆరంభించాలి.
* గర్భిణులకు 'టామిఫ్లూ' ఇవ్వటం.. తల్లీబిడ్డలకు సురక్షితమేనా?
గర్భిణులకూ, రెండు వారాల్లోపు బాలింతలకు.. స్వైన్‌ఫ్లూ అని అనుమానంగా ఉన్నా, లేక పరీక్షల్లో నిర్ధారణ అయినా కూడా.. యాంటీవైరల్ మందు 'ఒసాల్టిమివిర్' (టామిఫ్లూ)తో చికిత్స ఆరంభించాలి. నెలలు నిండిన వారితో సహా ఎన్నో నెల గర్భిణులైనా ఈ మందు తీసుకోవచ్చు. వీటిని గర్భిణులపై ప్రత్యేకంగా పరీక్షించి చూడలేదుగానీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సమాచారమంతా కూడా.. స్వైన్‌ఫ్లూ కారణంగా తలెత్తే తీవ్ర దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. గర్భిణులకు ఈ మందును ఇవ్వటమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తోంది. ఈ యాంటీవైరల్ మందును ఫ్లూ లక్షణాలు ఆరంభమైన తర్వాత ఎంత త్వరగా ఆరంభిస్తే అంత మంచిది. 48 గంటల్లోపు ఆరంభిస్తే ఇది సమర్థంగా పనిచేస్తుంది. తాజా అనుభవాల ప్రకారం- లక్షణాలు ఆరంభమైన 7 రోజుల్లోపు ఇచ్చినా కూడా వీటితో ప్రయోజనం ఉంటోందని వెల్లడైంది.
* గర్భిణులు టామిఫ్లూతో పాటు యాంటిబయాటిక్స్ కూడా వేసుకోవాలా?
ఇతరత్రా దుష్ప్రభావాలేమీ లేకపోతే గర్భిణులకు ఈ ఒక్క మందు ఇస్తే చాలు. ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫ్లూ జ్వర లక్షణాలతో పాటు శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన గొంతు-టాన్సిల్స్ వాపు నొప్పి, చెవి పోటు వంటి లక్షణాలు కూడా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా అవసరమవుతాయి. ఈ సమయంలో వీరికి కో-అమోక్సిక్లావ్ (పెన్సిలిన్/అమోక్సిసిలిన్ పడనివారికైతే క్లారిత్రోమైసిన్) వంటి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు.
* గర్భిణులు, బాలింతలు తెలిసో తెలియకో ఫ్లూ లేదా స్వైన్‌ఫ్లూ బాధితుల దగ్గరకు వెళ్లటం వల్ల వ్యాధి సోకుతుందేమోనని అనుమానంగా ఉంటే..?
ఫ్లూ/స్వైన్‌ఫ్లూ రాకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా ఈ ఒసాల్టిమివిర్(టామిఫ్లూ) మందును తీసుకోవచ్చు. దీనికోసం 75 ఎంజీ కాప్స్యూల్సు రోజుకు 2 చొప్పున, 5 రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయే తప్పించి అస్సలు రాదని మాత్రం చెప్పలేం. కాబట్టి ఈ మందు వాడుతున్నా కూడా ఫ్లూ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లటం మంచిది.
* బాలింతలకు స్వైన్‌ఫ్లూ వస్తే..?
గర్భిణుల్లో మాదిరిగా... బాలింతల్లో కింది నుంచి ఊపిరితిత్తుల మీద పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి వీరిలో శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కొంత తక్కువ. ఇతరత్రా సమస్యల ముప్పు మాత్రం ఉంటుంది. బిడ్డను వీరికి దూరంగా ఉంచటం మంచిది. వీరు శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. యాంటీవైరల్ (టామిఫ్లూ) మందు తీసుకోవాలి.
* ఈ ఫ్లూ మందు వేసుకుంటున్న బాలింతలు బిడ్డకు పాలివ్వచ్చా?
బాలింతలు టామిఫ్లూ వంటి యాంటీవైరల్ మందులు వేసుకుంటూ కూడా బిడ్డకు పాలివ్వచ్చు. తల్లికి జ్వరంగా ఉన్నా పాలివ్వచ్చు, కాకపోతే రోజూకంటే ఎక్కువసార్లు ఇవ్వాల్సి వస్తుంది. యాంటీవైరల్ మందులు తల్లిపాలలో చాలా స్వల్ప మోతాదులో వెళతాయిగానీ దానివల్ల బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తల్లికి స్వైన్‌ఫ్లూ ఉన్నాబిడ్డకు పాలివ్వటాన్ని ప్రోత్సహించాలి.
* జ్వరం తగ్గటానికి గర్భిణులు మందులు వేసుకోవచ్చా?
జ్వరం, నొప్పుల వంటి బాధలు తగ్గేందుకు గర్భిణులు 'ప్యారాసెటమాల్' బిళ్లలు వేసుకోవచ్చు. అవి సురక్షితమే. అయితే నొప్పి నివారిణి మందులైన ఐబూప్రోఫెన్ (బ్రూఫెన్) వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడీ-NSAIDs' రకం మందులు మాత్రం వాడకూడదు.
* కాన్పు దగ్గరపడిన గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే..?
సాధారణంగా ఫ్లూ లక్షణాలున్నప్పటికీ కాన్పు నొప్పుల వంటివన్నీ బాగానే తట్టుకోగలుగుతారు. అయితే నెలలు నిండిన గర్భిణికి స్వైన్‌ఫ్లూతో పాటు తీవ్రమైన శ్వాస సమస్యల వంటివి కూడా తలెత్తితే.. ఆమె శ్వాస పరిస్థితి మెరుగయ్యేందుకు ముందుగానే కాన్పు చెయ్యాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆమె పరిస్థితి నిలకడగా తయారైన తర్వాత.. సిజేరియన్ చెయ్యాల్సి రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో ప్రసూతి నిపుణులు, మత్తు వైద్యులు, వూపిరితిత్తుల నిపుణులు ఒక బృందంగా కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది.
స్వైన్‌ఫ్లూ రాకుండా గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
* గర్భిణులు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు పెట్టుకోకపోవటం మేలు. బయట ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. అలాగే సినిమా హాళ్లు, పెద్దపెద్ద షాపులు, బజార్లు.. ఇలా జనసమర్దంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం అవసరం.
* బాలింతలు కూడా రెండుమూడు వారాల పాటు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఇంటికి పరిమితమవ్వటం మేలు. బిడ్డ పుట్టిన సంబరంలో ఇంటికి బంధువులు, అతిథులు వచ్చినా వారికి కొంత దూరంగా ఉండటం మేలు.
* చక్కటి శుభ్రత పాటించాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇంట్లోగానీ, చుట్టుపక్కలగానీ ఎవరికైనా ఫ్లూజ్వర లక్షణాలు ఉంటే వారికి సాధ్యమైనంత దూరంగా ఉండటం అవసరం.
* ఈ సీజన్లో బయట తిరుగుతుంటే ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్కు పెట్టుకోవటం ఉత్తమం. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ముక్కుకు, నోటికి టిష్యూ పేపర్లు అడ్డుపెట్టుకోవటం, వెంటనే వాటిని పారెయ్యటం మంచిది.
* గర్భిణులంతా స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) రాకుండా టీకా తీసుకోవటం ఉత్తమం. ఈ టీకాలను ఎన్నో నెలలోనైనా తీసుకోవచ్చు. ఈ టీకాలతో ప్రత్యేకించి గర్భిణులకు హాని జరిగినట్టు ఎక్కడా దాఖలాల్లేవు. పైగా గర్భిణులకు స్వైన్‌ఫ్లూ వస్తే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బ్రిటన్‌తో సహా చాలా ఐరోపా దేశాల్లో గర్భిణులకు ప్రత్యేక ప్రాధాన్యంతో టీకాలు ఇస్తున్నారు. ఈ టీకా ఇప్పుడు మన దగ్గరా అందుబాటులో ఉంది కాబట్టి స్వైన్‌ఫ్లూ ముప్పు దరిజేరకుండా.. గర్భిణులతో సహా ఎవరైనా దీనిని తీసుకోవచ్చు.
గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు పెట్టుకోకపోవటం మేలు. బయట ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. బిడ్డ పుట్టిన సంబరంలో ఇంటికి బంధువులు, అతిథులు వచ్చినా వారికి కొంత దూరంగా ఉండటం మేలు. చుట్టుపక్కల ఎవరికైనా ఫ్లూ లక్షణాలుంటే వారికి దూరంగా ఉండాలి.
గర్భిణులకూ, రెండు వారాల్లోపు బాలింతలకు.. స్వైన్‌ఫ్లూ అని అనుమానంగా ఉన్నా, లేక పరీక్షల్లో నిర్ధారణ అయినా కూడా.. యాంటీవైరల్ మందు 'ఒసాల్టిమివిర్' (టామిఫ్లూ)తో చికిత్స ఆరంభించాలి. నెలలు నిండిన వారితో సహా ఎన్నో నెల గర్భిణులైనా ఈ మందు తీసుకోవచ్చు.
0 Comments