Full Style

>

ముందే గుర్తిస్తే బోన్ కేన్సర్‌తో ముప్పే లేదు

బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. అందుకే ఈ కేన్సర్లను ఎంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత ప్రయోజనం అంటున్నారు డాక్టర్ సిహెచ్ మోహన వంశీ.

ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.
ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ.
నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తూ ఉంటాం.
ప్రైమరీ బోన్ కేన్సర్లు
ఎముకల్లోనే వచ్చే ప్రైమరీ కేన్సర్లు పిన్న వయస్కుల్లో అంటే 25 ఏళ్ల లోపు వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అరుదుగా కొంత మందిలో 65 ఏళ్లు దాటిన వారిలో కూడా కనిపించవచ్చు. ప్రైమరీ బోన్ ట్యూమర్లు ముఖ్యంగా అతి సాధారణంగా కనిపించేవి మూడు రకాలు వాటిలో ఆస్టియో సార్కోమా ఒకటి ఇది ఎముకనుంచి పుడుతుంది. వీటికి చాలా వేగంగా పెరిగే ధర్మం ఉంటుంది. రెండవది ఈవింగ్ సార్కోమా. ఇది న్యూరల్ క్రస్ట్ నుంచి పుడుతుంది. ఇది ఎక్కువగా 5 నుంచి 15 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక మూడవది స్కాండ్రో సార్కోమా. ఇది ఎముకలోని కార్టిలేజ్ నుంచి వచ్చే కణితి. ఇది కొంత అరుదుగానే వస్తుంది.
ఆస్టియో సార్కోమా
ఆస్కియో సార్కోమా పదేళ్లుదాటిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 20 ఏళ్ల వయస్కుల దాకా ఈ కేన్సర్ బారిన పడవచ్చు. ఈ కేన్సర్లు పొడవైన అంటే తొడ, మోకాళ్లు, భుజం, మోచేతి ఎముకల్లో ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో 70 శాతం దాకా మోకాలి కీళ్లకు పైన గానీ, కింద గానీ, కనిపిస్తాయి. వీటికి చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఉంటుంది. ఈ కేన్సర్ ఏ కారణంగానైనా, బాల్యంలో రేడియేషన్ తీసుకున్న వారిలో ఈ ఆస్టియో సార్కోమా వచ్చే అవకాశాలు మిగతా వారితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి. అంత కు ముందే ఒకసారి కేన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్న వారిలో కూడా ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కేన్సర్‌లో లక్షణాలు పెద్దగా కనిపించవు.
కాకపోతే, స్వల్పంగా ఆయా భాగాల్లో నొప్పి ఉంటుంది. అందుకే పిల్లలు ఈ విషయమై నిర్లక్ష్యంగానే ఉండిపోతారు. ఆ నొప్పిని అంతకు ముందు ఏదో దెబ్బతగలడానికి ముడిపెట్టి, ఇది ఆ నొప్పే అనుకుంటారు. ఆ భాగంలో నొప్పితో పాటు, వాపు రావడం, ఆ భాగంలోని చర్మం మెరుస్తున్నట్లు అనిపించడం ఉంటాయి. అప్పటికైనా కేన్సర్‌ను గుర్తించకపోతే, ఆ ఎముక బాగా బలహీనపడి, ఒక్కోసారి అది విరిగిపోవచ్చు. ఈ సమస్యను గుర్తించడానికి ముక్క పరీక్ష ( బయాప్సి) చేయించాల్సి ఉంటుంది.
నీడిల్ ద్వారా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమస్య ఆస్టియో సార్కోమాగా నిర్ధారణ జరిగిపోయాక, ఆ వ్యాధి ఏ స్టేజ్‌లో ఉందో నిర్ధారిస్తాం. ఈ కేన్సర్‌లన్నీ ఎక్కువగా శ్వాసకోశాలకు పాకే అవకాశం ఉంటుంది. అందుకే బోన్ స్కాన్‌తో పాటు సీటీ స్కాన్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి ఏమైనా పాకిందేమో పరిశీలిస్తాం. కేన్సర్ అప్పటికే బాగా ముదిరిపోయి ఉంటే, కీమో థెరపీ ఒక్కటే చికిత్సా విధానం. ఒకవేళ కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి అప్పటికింకా అది ఒక భాగానికి పరిమితమై ఉంటే, ఆ భాగాన్ని ఒకప్పటిలా తీసివేసి అలాగే వదిలేయకుండా, దాన్ని నిలబెట్టే లింబ్ కన్సర్వేటివ్ సర్జరీ చేస్తాం.
అంటే ఆ భాగంలో ఒక కృత్రిమ ఎముకను అమరుస్తాం. అవసరమైతే కీలును కూడా మార్చివేస్తాం. అయితే వీరికి ముందు కీమోథెరపీ ఇచ్చి, ఆ తరువాతే సర్జరీ చేస్తాం. కీమో థెరపీ వల్ల కేన్సర్ కణితి ఏ మేరకు నశించిపోయిందో తెలుసుకుంటాం. ఇంకా బతికున్న కేన్సర్ కణుతులను గమనించి ఆ తరువాత కూడా కీమో థెరపీ ఇస్తాం. ఆస్టియో సార్కోమాను గుర్తించడంలో బాగా ఆలస్యమైపోతే, అప్పుడు ఆ ఎముక స్థానంలో కృత్రిమ ఎముకను బిగించే అవకాశాలు ఉండవు. ఎముకలో కణితి ఓ ఏడెనిమిది సెంటీ మీటర్ల కన్నా పెద్దదైనప్పుడు, ఎముక బలహీనపడి, అప్పటికే విరిగిపోయి ఉంటే, ఎముక చుట్టూ ఉండే కండరాలు కూడా ఈ కేన్సర్‌తో బాగా ప్రభావితమైనప్పుడు, రక్తనాళాల్ని కూడా ఆవహించిన ప్పుడు ఇంక ఆ అవయవాన్ని మొత్తంగా తీసివేయడం తప్ప లింబ్ కన్సర్వేషన్ సాధ్యం కాదు.
ట్రీట్‌మెంట్ పూర్తి అయిపోయిన తరువాత ఆ వ్యక్తిని నిరంతం పరీక్షలు చేయించవలసి ఉంటుంది. కారణమేమింటే ఈ కేన్సర్ శ్వాసకోశాల్లోకి పాకే అవకాశాలు ఎక్కువ. ఏమైనా సర్జరీ కన్నా ముందే కీమో థెరపీ ఇవ్వడం వల్ల ఫలితాలు ఇప్పడు ఫలితాలు బాగుంటున్నాయి. ఈ కేన్సర్‌లను చాలా ముందుగా గుర్తించినప్పుడే చికిత్సతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అందుకే పిల్లలు ఏ కాస్త కుంటుతున్నట్లు అనిపించినా వెంటనే పీడియాట్రిషియన్‌కు తప్పనిసరిగా చూయించాలి.
ఈవింగ్ సార్కోమా
ఇది బాగా చిన్నపిల్లల్లోనే అంటే 5 నుంచి 10 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎముకలోని న్యూరల్ క్రస్ట్ కణాల్లోంచి పుడుతుంది. ఇది పెద్ద ఎముకల్లోనే కాకుండా చిన్న ఎముకల్లోనూ అంటే, పక్కటెముకల్లో, వెన్నెముకల్లోనూ రావచ్చు. వీటికి ప్రత్యేకమైన ఇమ్యూనో కెమికల్ మార్కర్స్ ఉన్నాయి. దీన్ని సిడి-99 అంటారు. ఇది పాజిటివ్‌గా వస్తే ఈవింగ్ సార్కోమా అవడానికి అవకాశాలు ఎక్కువ. ఇది కూడా నొప్పిని, వాపును కలిగిస్తుంది. తరుచూ స్వల్పంగా జ్వరం కూడా రావచ్చు. ఈవింగ్ సార్కోమాను రౌండ్‌సెల్ ట్యూమర్ అని కూడా అంటారు.
ఈ ట్యూమర్స్ కీమో, రేడియేషన్ థెరపీలతో తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సకాలంలో సరియైన చికిత్స అందకపోతే, ఈ ట్యూమర్ ఎముక మజ్జలోకి, శ్వాసకోశాల్లోకి పాకే అవకాశం ఉంది. అందుకే ఈ కేన్సర్ వచ్చిన వాళ్లకు శరీరం మొత్తాన్ని పరీక్షించే పెట్ స్కాన్, బోన్ మ్యారో పరీక్ష కూడా అవసరమవుతుంది. వ్యా«ధి దశను, దాని తీవ్రతను అనుసరించి వైద్య చికిత్సలు ఉంటాయి. ఇతర భాగాలకు పాకి ఉంటే, కీమోథెరపీ ఒకటే చికిత్స. ఒకవేళ ఏదో ఒక భాగానికి పరిమితమై ఉంటే, 10 వారాల పాటు కీమోథెరపీ ఇచ్చి, ఆ తరువాత లోకల్ ట్రీట్‌మెంట్ చేస్తాం. అలాగే లోకల్‌గా రేడియేన్ ఇచ్చి ఆ తరువాత మళ్లీ కీమో థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. మూడవదైన కాండ్రో సార్కోమా, ఈ కేన్సర్ చికిత్స కూడా పైరెండు కేన్సర్ల లాగే ఉంటుంది.కీమో థెరపీ, రేడియోషన్ థెరపీల పాత్ర ఈ కేన్సర్లలోనూ కీలకం గానే ఉంటుంది.
సెకెండరీ బోన్ కేన్సర్స్
థైరాయిడ్ కేన్సర్, లంగ్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ సర్వైకల్ కేన్సర్ ఇలా ఏ కేన్సర్ ద్వారా ఎముకలకు పాకినా ఆ పాకిన ప్రదేశాన్ని అనుసరించి, వ్యాధి దశ, దాని తీవ్రతను అనుసరించి, దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. శరీరం బరువును మోసే కాళ్లలోనే కేన్సర్ ఉన్నప్పుడు, అతని బరువుతోనే అవి హఠాత్తుగా విరిగిపోయే ప్రమాదం ఎక్కువ.
దీనికి ఆ ఎముకలు బలహీనపడటమే కారణం. అయితే ఆ ఎముకల్ని తిరిగి శక్తివంతం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఇంజెక్షన్స్ చేస్తాం. అలాగే కొన్ని రకాల ట్యాబ్లెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత రేడియేషన్ కూడా ఇస్తే, ఆ ఎముకలు గట్టిపడతాయి. వెన్నెపూసల్లో కేన్సర్ ట్యూమర్లు వచ్చి వెన్నుపామును నొక్కడం ద్వారా రెండు కాళ్లూ చచ్చుబడే ప్రమాదం ఉంది. అందుకే శరీరంలో ఎక్కడ ఏ బాగంలో కేన్సర్ కణుతులు ఉన్నాయో వెంటనే గమనించి చికిత్స చేస్తే, ఆ వ్యక్తి జీవిత కాలం గణనీయంగా పెరుగుతుంది. ఒక ప్రామాణికమైన జీవితం వారి సొంతమవుతుంది.

Post a Comment

0 Comments