తలకు గాయాలు-మానసిక సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
తలకు గాయమైనప్పుడు మానసిక సమస్యలు కలగడం సర్వసాధారణం.పెరుగుతున్న వాహ నాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అనేక కారణాల వల్ల పలువురు ప్రమాదాలకు గురై, తలకు గాయాలై బాధపడు తున్నారు. తలకు గాయాలు కావడం కారణంగా అన్ని రకాల మానసిక సమస్యలు కలుగవచ్చు. తలకు కలిగే గాయాల్లోని రకాలను పరిశీలిద్దాం.
ఓపెన్ హెడ్ ఇంజ్యూరీ
తుపాకీ గుండు తలలోకి దూసుకుపోయిన ప్పుడు, లేదా ఏదైనా పదునైన ఆయుధం (కత్తివంటిది) తలలోకి చొచ్చుకుపోయినప్పుడు కలిగే గాయాలను ఓపెన్ హెడ్ ఇంజ్యూరీ అని వ్యవహరిస్తాం.
సాధారణంగా ఇటువంటి గాయాల్లో తలలో మెదడుకు ఏవైపు గాయమైతే, అక్కడి మెదడే దెబ్బ తింటుంది.మెదడు మొత్తం దెబ్బ తినే అవకాశం (దీనిని డిఫ్యూజ్ డామేజ్ అంటారు) ఉండదు. కనుక స్పృహ తప్పి పడిపోయే అవకాశం తక్కువ.అయితే ఓపెన్ ఇంజ్యూరీలో కపాలం చీలి, మెదడు భాగం వెలుపలికి కనిపిస్తుంది కనుక బయటి వాతావరణానికి అది గురై ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెనింజై టిస్, ఎన్‌కెఫలైటిస్, బ్రెయిన్ యాబ్సెస్‌లు సంభవించే అవకాశం ఉంటుంది.
క్లోజ్డ్ హెడ్ ఇంజ్యూరీ
తలకు తగిలే ఈ రకమైన గాయాల్లో మెద డుకు కవచాలుగా ఉండే మెనింజెస్, కపాలం విచ్ఛిన్నం కావు. కనుక మెదడు బయటి వాతావ రణానికి గురి కాదు. అయితే మెదడుకు మాత్రం గాయమవుతుంది. ఇటువంటి గాయాలు సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో, పదునుగా లేని వస్తువుల వల్ల కలిగే గాయాల్లో కనిపి స్తుంటాయి. వీటిలో మెదడు అనేక రకాలుగా దెబ్బ తింటుంది. తలలో కపాలాంతర్భాగంలోని ఒక స్థిరమైన ప్రదేశంలో మెదడు ఉంటుంది. మెదడుకు గాయమైనప్పుడు ఆ భాగంలో మెదడు చిట్లడం సహజంగా జరిగే క్రియ. అయితే దీనితోపాటు మెదడుకు గాయమవుతున్న సమయంలో జడత్వం కారణంగా అనేక ఒత్తిళ్లకు మెదడు గురవుతుంది. ఈ రకమైన ఒత్తిళ్లను యాక్సిల రేటరీ, డిసెలరేటరీ, రొటేటరీ ఫోర్సెస్ అని విభజించవచ్చు.
-గాయమవుతున్న సమయంలో ఒత్తిళ్ల కారణంగా మెదడు వేగంగా ముందుకు లేదా వెనుకకు తోసినట్లు కావడం, కుదుపులకు గురి కావడం, మెలిపడటం మొదలైనవి సంభవి స్తాయి. వీటివల్ల మెదడులోని యాక్సాన్స్ తెగి పోవడం, రక్తనాళాలు చిట్లిపోవడం జరుగు తుంది.ఫలితంగా మెదడులో అనేక భాగాల్లో రక్తం కారడం, మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్టిపోవడం, మెదడులో నీరు చేరడం తదితర మార్పులు సంభవిస్తాయి. మెదడులోని వివిధ భాగాలు దెబ్బ తినే అవకాశం (డిఫ్యూజ్ డామేజ్) అధికం. కనుక తెలివి తప్పడం ఉంటుంది.
మెదడులో సంభవించే రక్త స్రావాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.మెదడు చుట్టూ ఉండే డ్యూరామాటర్‌కు బైట కలిగే రక్తస్రావాన్ని ఎక్స్‌ట్రా డ్యూరల్ హెమరేజ్ అని, డ్యూరామా టర్ లోపలి వైపు జరిగే రక్తస్రావాన్ని ఇంట్రా డ్యూరల్ హెమరేజ్ అని విభజించవచ్చు. ఎక్స్‌ట్రా డ్యూరల్ హెమరేజ్ శస్త్ర చికిత్స అవసరమయ్యే అత్యవసర పరిస్థితి. రక్తాన్ని వెంటనే డ్రెయిన్ చేయాల్సి ఉంటుంది. సబ్‌డ్యూరల్ హెమరేజ్ ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది. తలకు గాయమైన తరు వాత రోగి పరిస్థితి మెరుగుపడటకపోవడం, నిల కడగా లేని మత్తుకు రోగి గురి కావడం వంటివి వారాల తరబడి కొనసాగడం తదితర లక్షణాలు సబ్ డ్యూరల్ హెమరేజ్‌ను సూచిస్తాయి. ఇవి వాటంతట అవే తగ్గుతాయి. లేదా కొన్ని పరిస్థితుల్లో శస్త్ర చికిత్స అవసరమవుతుంది.
మెదడులోని ఫ్రాంటల్ కార్టెక్స్‌కు చెందిన మీడియల్ ఆర్బిటోఫ్రాంటల్ భాగం, టెంపొరల్ లోబ్‌లో కింది భాగంలో ఎక్కువగా కముకు దెబ్బలు (కంట్యూషన్స్) తగులుతుంటాయి. మెదడులో దెబ్బ తగిలిన భాగానికే కాకుండా, దానికి ఎదురుగా ఉండే భాగంలో కూడా గాయ మయ్యే అవకాశం ఉంటుంది. దీనిని కౌంటర్ కూప్ ఇంజ్యూరీ అంటారు.మెదడుకు వాపు సంభవించినప్పుడు కపా లాంతర్గత ఒత్తిడి పెరుగుతుంది.ఫలితంగా మెదడుకు రక్త సరఫరా తగ్గే పరిస్థితి (ఇష్కి మియా) ఏర్పడుతుంది. మెదడుకు గాయమైన ప్పుడుమెదడులో అమైలాయిడ్ నిలువలు ఎక్కు వవుతాయి. అలాగే తలకు గాయమైనప్పుడు సెరిబ్రల్ ఎట్రొఫీ, హైడ్రోసెఫలస్, మెనింజైటిస్ మొదలైనవి కూడా కలుగుతాయి.
స్పృహ కోల్పోవడం
తలకు గాయమైనప్పుడు, కొన్నిసార్లు స్వల్ప గాయానికే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనికి కారణం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యమే. ఎక్కువ సమయం తెలివి కోల్పోయినప్పుడు ఫ్రాంటల్ కార్టెక్స్, ఇతర సబ్ కార్టికల్ భాగాలు దెబ్బ తిన్నట్లు భావించాలి. పెరిగిన కపాలాంతర్గత ఒత్తిడి మెదడుకు రక్త సరఫరాను ఆటంక పరుస్తుంది. ఫలితంగా వ్యక్తి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.మెదడులో అనేక చోట్ల యాక్సాన్స్‌కు దెబ్బ తగలడం వల్ల కూడా కోమా సంభవిస్తుంది. బ్రెయిన్ స్టెమ్‌నుంచి చైతన్యానికి అవసరమయ్యే సంకేతాలు అందకపోవడం దీనికి కారణంగా భావిస్తారు.కొన్నిసార్లు మద్యపానం, రక్తంలో చక్కెర శాతం పడిపోవడం, మూర్ఛల కారణంగా తలకు గాయం సంభవిస్తుంది. సహజంగానే ఈ పరిస్థితుల్లో బాధితులు మత్తుకు గురవుతారు కనుక
తరువాత తలకు గాయమైనప్పుడు అది రెట్టింపు అవుతుంది.
తలకు గాయం తీవ్రత
తలపై తగిలిన దెబ్బ తీవ్రతకు, మెదడుకు జరిగే గాయానికి పొంతన ఉండకపోవచ్చు. తలకు తగిలిన గాయం తీవ్రతను తెలియజేసే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి -
- గాయమైన తరువాత కలిగిన జ్ఞాపక శక్తి లోపం తిరిగి మామూలు స్థితికి చేరడానికి పట్టిన సమయం. ఈ సమయం ఎంత అధిక మైతే మెదడుకు అంత తీవ్రమైన గాయమైనట్లు భావించాలి.
- కోమాలో ఉన్న సమయం.
- మెదడుకు గాయమైన తరువాత స్పృహ తప్పి పడిపోయే తీవ్రతను గ్లాస్‌గో కోమా స్కేల్‌పై కొలుస్తారు. ఈ తీవ్రత కూడా మెదడుకు కలిగిన గాయం తీవ్రతను తెలియజేస్తుంది.
గ్లాస్‌గో కోమా స్కేల్ (పక్కన వేసిన అంకెలు ఆయా అంశాల స్కోర్‌ను తెలియజేస్తాయి.)
1) కళ్లు పరీక్షించాలి.
- తెరచి ఉంటే (వాటంతట అవే) - 4
- శబ్దం చేసినప్పుడు తెరచుకుంటే - 3
- గిల్లడం వంటి వాటివల్ల తెరచుకుంటే - 2
- అసలు తెరవకపోతే - 1
2) సమాధానం సరిగ్గా ఇస్తున్నారా? అనేది పరిశీలించాలి.
- సమాధానాన్నిబట్టి సరైన అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. - 5
- అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. - 4
- అసందర్భ పదాలు వాడుతున్నారు - 3
- మనం గ్రహించ లేని శబ్దాలు చేస్తున్నారు - 2
- ఏమీ సమాధానం లేదు - 1
ఇదే విధంగా శారీరక కదలికలను కూడా స్థాయినిబట్టి 6 నుంచి 1 వరకూ గ్రేడ్ చేయడం జరిగింది. ఈ మూడు రకాలను పరీక్షించి, ఆయా సంఖ్యలను కూడి మొత్తం స్కోర్‌ను నిర్ణయిస్తారు. దానినిబట్టి కోమా తీవ్రత ఏ దశలో ఉందో నిర్ణయిస్తారు.మెదడుకు గాయమైనప్పుడు ఎక్సిటోటాక్సిక్ న్యూరోట్రాన్స్‌మిటర్స్ అయిన గ్లూటమేట్, ఆస్పర్టేట్ అనేవి విడుదల అవుతాయి. ఇవి చుట్టుప్రక్కల ఉన్న కణాల మరణానికి దారి తీస్తాయి.
తలకు గాయమైనప్పుడు హైపోథాలమిక్, పిట్యూటరీ, అడ్రినల్ యాక్సిస్‌లో కూడా మార్పులు సంభవిస్తాయి. గాయమైనప్పుడు ప్రోలాక్టిన్ స్థాయి అధికంగా ఉండటం హైపోథా లమస్ దెబ్బ తిన్నదనడానికి సూచిక. దీనితో పాటు కార్టిసాల్, గ్రోత్ హార్మోన్‌లు కూడా పెరు గుతాయి.అయితే సెక్స్ స్టీరాయిడ్స్, థైరాయిడ్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ మార్పులు, పైన పేర్కొన్న కారణాల వల్ల అనేక మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్న మవుతాయి. ఇవి స్వల్ప, దీర్ఘకాలిక మార్పు లుగా ఉండవచ్చు. దుందుడుకుతనం, చిరాకు, వ్యక్తిత్వ మార్పులు, జ్ఞాపకశక్తి లోపాలు, విచక్షణాశక్తిలోపం, సైకోసిస్, వ్యాకులత, ఆందో ళన, మానియా మొదలైన సమస్యలు ఉత్పన్న మవుతాయి.తలకు తగిలే గాయాలకు (హెడ్ ఇంజ్యూరీస్) సంబంధించిన చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.
వీటిలో ఫినీస్ గేజ్ అనే వ్యక్తికి కలిగిన గాయం ప్రముఖంగా చెప్పుకోదగినది.
ఒక పేలుడు సందర్భంగా ఒక ఇనుప కడ్డీ అతడి తలలోకి రంధ్రం చేసుకుంటూ చొచ్చు కునిపోయి, రెండవవైపునుంచి బైటికి వస్తుంది. ఈ విధంగా తలను, మెదడును చీల్చుకుంటూ కలిగిన గాయం కారణంగా ఇతని వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. చిన్న పిల్లవాడిగా, ఏ కారణం లేకుండానే క్షణంలో నవ్వు, మరొక క్షణంలో ఏడుపు, బాధ వంటి భావోద్వేగాలను ప్రదర్శిస్తూ, విచక్షణ, బుద్ధి కోల్పోయి చిత్రంగా ప్రవర్తించడం ఆరంభమవుతుంది.
0 Comments