Full Style

>

Heart attack and high cholesterol,గుండెపోటు-అధిక కొలెస్టిరాల్ -2


మనకు మధుమేహంలో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుంటాయని తెలుసు. అలాగే గుండెపోటుకు దారి తీసే గుండె జబ్బులో కూడా మూడు రకాలున్నాయి.
* టైప్‌- 1: చాలా చిన్నవయసులోనే గుండెలోని రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోతుండే అత్యంత ప్రమాదకర రకం ఇది. సాధారణంగా గుండె జబ్బు 55-60 ఏళ్ల వారిలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ రకం 45 ఏళ్ల లోపే.. చిన్నవయసులోనే ఆరంభమైపోతుంది. కొందరికి 30 ఏళ్లలోపే గుండెలోని రక్తనాళాల్లో 70% వరకూ మూసుకుపోయి తీవ్రమైన గుండె జబ్బు ఆరంభమైపోతుంది కూడా. మధుమేహం, హైబీపీ వంటి ముప్పులేమీ లేకుండా కూడా వీరిని గుండెజబ్బు కబళిస్తుండటం గుర్తించాల్సిన అంశం. పైగా ఒకసారి ఈ రకం గుండెజబ్బు బారినపడ్డారంటే ఎంత చికిత్స చేసినా ఆ దుష్పరిణామాలను తప్పించుకోవటం కష్టంగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన 'మాలిగ్నంట్‌' రకం గుండె జబ్బు అంటున్నారు. దీనికి చెడ్డ కొలెస్ట్రాల్‌లో భాగమైన 'లైపోప్రోటీన్‌ ఎ' అనేదే ప్రధాన కారణమవుతోంది.
* టైప్‌-2: వయసు పైబడిన వారిలో అంటే 50, 60 ఏళ్ల తర్వాత సాధారణంగా తరచూ చూస్తుండే రకం ఇది. వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులన్నీ ఉంటాయి.
* టైప్‌ 3: ఇందులో పైన పేర్కొన్న రెండు రకాల లక్షణాలూ కనిపిస్తాయి. ఇది 45-65 ఏళ్ల లోపు ముంచుకొస్తుంది, వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులే కాదు.. లైపోప్రోటీన్‌-ఎ వంటి ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ముప్పులూ కనబడతాయి.

కొత్త ముప్పుపై కన్నేసి ఉంచండి!
లైపోప్రోటీన్‌ 'ఎ'
జన్యుపరంగా సహజంగానే భారతీయుల్లో చెడ్డకొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌) అధికంగా ఉంటోంది. దీనికి తోడు ట్రైగ్లిజరైడ్లు, ఏపీఓబీ, ఏపీఓఎ1 వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉంటోంది. ఇవన్నీ గుండెజబ్బుకు దారి తీసేవే. వీటికి తోడు గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవటంలో కీలక పాత్ర పోషించే 'లిపోప్రోటీన్‌-ఎ' కూడా భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంటోంది. ఇది నేరుగా రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఇది 20 ఎంజీ కన్నా తక్కువ ఉండాలి. ఇది 100 ఎంజీకి చేరుకుంటే చాలా త్వరగా రక్తనాళాల్లో పూడిక తెప్పిస్తుంది. ఇలాంటి వారికి స్టెంట్స్‌ అమర్చినా అవి కూడా త్వరగా పూడుకుపోతుంటాయి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైందని అనుకోవచ్చు. స్వతహాగా ఇది నష్టం కలిగించటమే కాదు.. 'అగ్నికి ఆజ్యం'లా ఇతరత్రా ముప్పులకు తోడై.. పరిస్థితి త్వరగా ముదిరేలా కూడా చేస్తోంది.
ఈ లైపోప్రోటీన్‌-ఎ ఎక్కువ ఉండటంతో పాటు...
* మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటే- రిస్కు 8 రెట్లు ఎక్కువ.
* చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే- ముప్పు 12 రెట్లు ఎక్కువ.
* మధుమేహం ఉంటే- ముప్పు ఏకంగా 16 రెట్లు ఎక్కువ.


Post a Comment

0 Comments