కుటుంబంలో అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు ఎవరైనా విలవిల్లాడిపోవటం సహజమే. తీవ్ర ఆవేదనతో చాలారోజుల పాటు కుమిలిపోవటమూ తెలిసిందే. ఇలా ఆత్మీయులను కోల్పోయిన బాధను రచయితలు గుండెకోత, గుండె బరువెక్కటం వంటి పదాలతో వర్ణిస్తుంటారు కానీ.. ఇలాంటి సమయాల్లో నిజంగానే గుండెపోటు ముప్పూ పొంచి ఉంటుందంటే నమ్ముతారా? తాజా అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. గుండెపోటు మూలంగా ఆసుపత్రిలో చేరిన కొందరిపై ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములు.. ఇలా కుటుంబంలో సన్నిహితులు ఎవరైనా ఇటీవలే మరణించారా? అనే విషయాన్ని పరిశీలించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆత్మీయులు మరణించిన నాడే ఆ బాధతో కుమిలిపోయేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 21 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ముప్పు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ఈ ప్రమాదం నెల వరకు కొనసాగుతుండటం గమనార్హం. తీవ్ర ఆవేదనకు లోనయ్యేవారిలో కుంగుబాటు, కోపం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే వీరిలో నిద్రలేమి, ఆకలి తగ్గటం, ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ అధిక స్థాయిలో ఉండటమూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టటానికి దోహదం చేస్తున్నాయి. అందువల్ల ఆవేదన, బాధలకు గురైన సమయాల్లో ఛాతీలో అసౌకర్యం, నొప్పి.. మెడ, దవడ, వెన్ను, చేతుల్లో అసౌకర్యం.. శ్వాసలో ఇబ్బంది.. వికారం.. కళ్లు తిరగటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గుండెపోటు లక్షణాలను సూచించేవే అని మరవరాదు
0 Comments