Full Style

>

థైరోయిడ్ సమస్యలు



ధైరాయిడ్‌ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును. 

థైరాయిడ్‌: 

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్‌ ఏపిల్‌) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది. 

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది. 


హైపర్‌ థైరాయిడ్‌జమ్‌: 


ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది. 

లక్షణాలు: 

ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్‌). 

1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ. 
2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు. 
3. చేతులు వణకడం.
 4. చెమటలు పట్టడం. 
5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం.
 6. వేడి తట్టుకోలేక పోవటం. 
7. జుట్టు ఊడిపోవటం
 8. తరచూ విరేచనాలు.
 9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం.
 10. తరచూ రుతు శ్రావం. 
11. సక్రమంగా లేని గుండె లయ 

చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

హైపోథైరాయిడిజం: 


థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది. 

లక్షణాలు: 

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత. 

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా 

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును. 

టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును . 

రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక. 

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. 

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుం ది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి . 

థైరాయిడ్‌ వంటి సమస్యలుండే వారికి పోషకాహారము

శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 

పోషకాహారమే పరిష్కారం.. 
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు. 

ఇనుమే.. ఇంధనం 
పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి. 

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. 

ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. 

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి. 

క్రూసీఫెరస్‌ రకం ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. 

పాలు, చేపలతో ఫలితాలు 
విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి. 

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం 
క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు


Post a Comment

0 Comments