అస్తవ్యవస్థమైన జీవన గతి, ఆహార లోపాలు, మానసిక ఒత్తిడులు
మొదలైన కారణాల వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. వీటిలో సియాటికా గృథ్రసీ వాతం
ప్రముఖమైనది.
ఇది కటివాతం (నడుమునొప్పి) అనంతరం గానీ, లేక ప్రారంభం నుండి గానీ 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గలవారికి అతి సాధారణంగా కలుగుతుంది. కటివాతంతో కలిపి చూస్తే మధ్య వయస్కుల్లో నూటికి 30 నుండి 90 మంది వరకూ ఈ వ్యాధి అనుభవించి ఉంటారని పరిశోధకుల అంచనా. ఇది మధ్య వయస్కులలో అధికంగా ఉండటం చేత, ఈ వ్యాధి మాటిమాటికీ బాధ పెట్టేది కావడం వల్ల వారి దైనందిన కార్యక్రమాలకు సహితం గైర్‌హాజరు కావడం జరుగుతున్నది. దీనివలన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
లక్షణాలు తీవ్రమైన వేదన, స్తబ్ధత, చురుకులు, లాగినట్లుండుట ఈ లక్షణాలు తుంటి నుండి ప్రారంభమై కటి ప్రదేశానికి క్రమంగా తొడలు, మోకాళ్ళు, పిక్కలు తరువాత పాదాల వరకూ వ్యాపిస్తుంటాయి. ఆయా ప్రదేశాల్లోని కండరాలు వాతం వలన వికృతి పొందటంతో నడక సహితం కష్టమవుతుంది. ఆయుర్వేదంతో ఈ లక్షణాలతో కూడుకున్న వ్యాధిని గృధ్రసీ వాతం అంటూరు. ఈ వ్యాధి ప్రధానంగా వాతం, కఫం, వికృతి చెందడం వల్ల కలుగుతుంది. గృథ్రసీ గృధ్ర అంటే గ్రద్ధ. ఈ వ్యాధిలో రోగి గ్రద్ధవలే ఒక కాలు పట్టి పట్టి పట్టి నడుస్తాడు. కనుక గ్రద్ధ లాంటి నడక కలిగించే వ్యాధి కాబట్టి గృధ్రసీ అన్నారు. ఈ వ్యాధి మొదటి దశలో కటి ప్రదేశాన్ని కదిలించినా, వంగినా, ప్రక్కలకు తిరిగనా పట్టినట్లుండి బాధ కలుగుతుంది. పెయిన్ కిల్లర్స్ వాడాల్సినంత తీవ్రత ఉడకపోయినా కటి ప్రాంతానికి నొప్పి పరిమితమై ఉంటుంది.
రెండవ దశలో కటి ప్రాంతంలో నొప్పి పరిమితంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తొడ భాగాలకు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక వ్యాధి తీవ్రావస్థలో ప్రక్కలకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువై నడుము ప్రాంతంలో ఉన్న పేవులపై ఉద్విగ్నత, కదలికలో అవరోధము, ఏ కొంచెం కదిలినా దాని వలన బాధ, దగ్గుట, తుమ్ముట మొదలైన వాటి వల్ల నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ లక్షణాలు అకస్మాత్తుగా గానీ, ప్రారంభమైన కొంత కాలానికి గానీ ఏర్పడటం జరుగుతుంది. ఇది రెండు పాదాల్లో గానీ ఒకే పాదంలోగానీ సాధారణంగా కన్పిస్తూ ఉంటుంది.
కారణాలు
ఆహారసంబంధమైనవి
ఆహార లోపాలు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల గృధ్రసీనాడీ పోషణ సరిగా జరుగక ఈ వ్యాధి కలుగుతుంది.
మానసిక కారణాలు
మానసిక వత్తిడులు, ఉద్వేగం, భయం, నిరాశ మొదలైన కారణాలు దీర్ఘకాలిక కటిగతపేశీ సంకోచమునకు దారి తీయడముతో దౌర్భల్యం, వేదన, పాద వేదనకు క్రమంగా కారణమవుతాయి.
శారీరక కారణాలు
శరీరాన్ని వక్రంగా ఉంచడం, దెబ్బలు, దూకడం, అధిక భారాన్ని మోయడం, గుల్ఫాది మర్మలపై దెబ్బ తగలడం మొదలగునవే కాక వ్యాయామం చేయకపోవడం, గర్భిణీ, మధుమేహం, ఎముకుల టి.బి., సిఫిలిస్ లాంటి సుఖవ్యాధులు, కీళ్ళువాతం, వార్థక్యం, స్పాండిలైటిస్, ఎముకులు అరుగుట మొదలైనవి వ్యాధిని కలిగిస్తాయి.
చికిత్స
చికిత్స ప్రధానంగా పాదాల్లోని కదలికవరోధాన్ని తగ్గించడం, సియాటికా నాడిపై వత్తిడిని తొలిగించడం వంటి వాటిపై కేంద్రీకృతమై ఉంటుంది. ఇది నాలుగు పద్ధతులు.
1.ఆహార నియంత్రణ, 2. దిన చర్యలు క్రమబద్దీకరించడం, 3. ఔషధ ప్రయోగం, 4. పంచకర్మలు.
1.ఆహార నియంత్రణ
వేపుడు, పెరుగు, పులుపు వంటి వాటిని అధికంగా సేవించడం ఆపుచేయాలి. క్రమం తప్పకుండా ఆహారం ఎక్కువగా నీరు, పీచు పదార్థాలు తీసుకోవాలి.
2. దినచర్య క్రమబద్ధీకరణ
స్వల్ప వ్యాయామం హితకరం. అతేకాక చల్లటి తేమ వాతావరణానికి గురికాకుండా ఉండటం, గతుకుల్లో ప్రయాణాలు చేయకుండా ఉండటం, ఎక్కువసేపు నిలబడకుండా లేక కూర్చోకుండా ఉండటం, వెన్నును నిటారుగా ఉంచడం, మల మూత్రాది వేగాలను నియంత్రిచకుండా ఉండటం చేయాలి.
3. ఔషధ ప్రయోగం
నిర్గుండి, అశ్వగంథ మొదలగు ఔషధ ద్రవ్యములతో తయారుచేయబడిన ఔషధాలు, తైలాలు, ఘృతాలు, టాబ్లెట్లు, లేహ్యాలు, చూర్ణాలు, ఆసనాలు, అర్షిష్టాల రూపంలో ప్రయోగించడం జరుగుతుంది.
4. బాహ్య చికిత్సా పద్ధతులు
ఇందులో ప్రధానంగా పంచకర్మల ద్వారా అంటే విరేచనం, వస్తి మొదలగు వాటి ద్వారా దోష నివారణం చేయడం జరుగుతుంది. తద్వారా సియాటికా నాడిపై వత్తిడిని తగ్గించడమే కాకుండా వ్యాధి పునరాగమనం నియంత్రించవచ్చు. అభ్యంగం, పిజిఛిల్, ఎలకిడి, నవరకిడి, మర్మ చికిత్స మొదలగు కేరళీయ చికిత్సా పద్ధతుల ద్వారా అవసరానుసారం చికిత్స చేయడం జరుగుతుంది.
0 Comments