Full Style

>

ఆఫీసులో పని, ఇంటికొచ్చాక ఛాటింగ్‌.. కొన్నాళ్లకు "కళ్ల" పరిస్థితి..?

Home Remedies

ఆఫీసులో బోలెడంత పని, ఇంటికి వచ్చిన తరువాత ఫ్రెండ్స్‌తో ఛాటింగ్.. అదేపనిగా కంప్యూటర్ ముందు గంటలతరబడీ గడిపేయటం నేటి ఆధునిక జీవనశైలిలో భాగం. అలాగే విశ్రాంతి తీసుకుంటున్నామని చెబుతూనే అనేక గంటలపాటు టీవీని చూడటం కూడా అలాంటివాటిలో ఒకటి. అయితే ఇలా చేస్తూపోతే కొన్నాళ్లకు "కళ్ల" ఆరోగ్యం మాటేంటి..?

టీవీలముందు, కంప్యూటర్లముందు గంటలతరబడీ గడపటంవల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యలబారిన పడతారు. సరైన నిద్రలేని కారణంగా కళ్లకింద నల్లటి చారలు, కంటిచూపు మందగించటం, కళ్లలో మంటలు, కళ్లలోంచి నీరు కారటం.. లాంటివన్నీ క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఇలాంటి సమస్యల పాలవకుండా.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే గాకుండా, మిలమిలా మెరిసే అందమైన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా..

కళ్లకు విశ్రాంతినివ్వాలంటే.. ప్రతి రెండు గంటలకోసారి చేస్తున్న పనికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలి. ఒకటి రెండు నిమిషాలు కళ్లు మూసుకుని, ఆ తరువాత చూపుడు వేలుని రెండు కళ్లమధ్య ఉంచి, కాసేపు తదేకంగా ఆ వేలుని చూడాలి. ఆపై వేలుని కళ్లకు మరీ దగ్గరగా, కాసేపు దూరంగా ఉంచి... కళ్లను పైకి, కిందకు, కుడి ఎడమలకు, గుండ్రంగా తిప్పుతూ చూడాలి. ఇది కళ్లకు చక్కటి వ్యాయామంగా పనిచేసి అలసటను దూరం చేస్తుంది. కళ్లకు సాంత్వన లభిస్తుంది.

శారీరక వ్యాయామంతో కండరాలు ఆరోగ్యంగా మారతాయనేది ఎంత వాస్తవమో, కనుపాపపై ఏర్పడే ఒత్తిడి దూరమవుతుందనేదీ అంతే నిజం. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లూకోమా సమస్య వచ్చే అవకాశముంది. దానికి వ్యాయామమే విరుగుడు. అందుకే తేలిక పాటి వ్యాయామాన్ని ఎంచుకుని, క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించాలి.

అలాగే మంచినీళ్లు తక్కువగా తాగితే కంటిపై ప్రభావం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగకపోతే శరీరంలో తేమ తగ్గుతుంది. కళ్లు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి. కళ్లకింద ఉబ్బడం మొదలవుతుంది. అలాంటప్పుడు వెంటనే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చల్లగా ఉండే టీ బ్యాగులు, చల్లని పాలల్లో ముంచిన దూదిని అప్పుడప్పుడు కళ్లపై పెట్టుకోవడం మంచిది. నల్లగా మారి, ఉబ్బిన కళ్లకు ఇలాంటివి చక్కగా పనిచేస్తాయి.

కళ్లను ఆరోగ్యంగా చూసుకోవాలంటే.. ఆహారపరంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో బీటా కెరొటీన్‌ను మించిన పదార్థం లేదు. ఇది కొన్నిరకాల పోషకాలను విటమిన్‌ ఏగా మార్చి, కళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. రే చీకటిని దూరం చేస్తుంది. కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు, ఆప్రికాట్లు, బొప్పాయి, మామిడి, పాలకూరలను ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటే.. మిలమిలలాడే ఆరోగ్యకరమైన నయన సౌందర్యం సొంతమవుతుంది.

Post a Comment

0 Comments