Pre-clinical Diabetes awareness,ముందస్తు మధుమేహం అవగహహన,ప్రి క్లినికల్ డయాబెటీస్ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మధుమేహం. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా దొంగదెబ్బ తీసే ఇది వచ్చాక ఎలాగూ జాగ్రత్తలు తీసుకోకతప్పదు. గ్లూకోజును అదుపులో ఉంచుకుంటూ.. గుండె, కిడ్నీ జబ్బుల వంటి ఇతరత్రా సమస్యల బారినపడకుండా చూసుకోకా తప్పదు. కానీ పరిస్థితి అంతవరకూ రాకముందే.. తొలి దశలోనే మధుమేహాన్ని ఎదుర్కోవటంపై ఆధునిక వైద్యరంగం ఇప్పుడు తీవ్రంగా దృష్టి సారించింది. మధుమేహం మొగ్గతొడిగే 'ప్రి క్లినికల్ డయాబెటీస్' సమయంలోనే దాని ఆనుపానులను గుర్తించి, అవసరమైతే అప్పుడే చికిత్సలు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై సాగుతున్న పరిశోధనలూ.. పుట్టుకొస్తున్న ఆధునిక పరీక్షలూ.. చికిత్సలూ సరికొత్త ఆశలనూ రేకెత్తిస్తున్నాయి!
నిజానికి మధుమేహులంతా ప్రి క్లినికల్ డయాబెటీస్- ముందస్తు మధుమేహం- దశను దాటుకునే అందులోకి అడుగుపెడతారు. ఈ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహానికి కాస్తయినా అడ్డుకట్ట వేయొచ్చు. మనదేశంలో ముఖ్యంగా మనరాష్ట్రంలో ఇది అత్యంత అవసరం. ఎందుకంటే మనదగ్గర నానాటికీ ముందస్తు మధుమేహుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అన్నింటికన్నా మించి మధుమేహుల్లో కనిపించే సమస్యలు ప్రి డయాబెటీస్ బాధితుల్లోనూ కనిపిస్తుండటం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల మధుమేహానికే కాదు.. ముందస్తు మధుమేహానికీ చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. విదేశాల్లో ఇప్పటికే మొదలైన ఈ చికిత్సలను త్వరలోనే మనదగ్గరా ఆరంభించే సమయం ఆసన్నమైందని
మధుమేహం పెద్దవాళ్లనే కాదు.. అప్పుడే పుట్టిన శిశువులను సైతం వదలటం లేదు. దీన్ని కట్టడి చేయకపోతే శరీరం మొత్తాన్ని కబళిస్తుందనే విషయాన్ని అందరూ గుర్తిస్తున్నారు. కానీ మధుమేహానికి ముందు దశ అయిన ప్రి క్లినికల్ డయాబెటీస్‌ను పెద్దగా పట్టించుకోవటం లేదు. నిజానికి దీనిపై సత్వరం దృష్టి పెట్టాల్సిన అవసరమున్నట్టు తాజా అధ్యయనాల అంచనాలు హెచ్చరిస్తున్నాయి. మధుమేహంపై ప్రస్తుతం మనదేశంలో మూడు సర్వేలు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా లక్షలాది మందికి పరీక్షలు చేస్తూ మధుమేహుల సంఖ్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఓ ప్రైవేటు సంస్థ కూడా ఇందులో పాలు పంచుకుంటోంది. ఈ సర్వేల పూర్తి నివేదికలు ఇంకా వెలువడకపోయినప్పటికీ అంచనాలు మాత్రం ప్రమాద ఘంటికలనే మోగిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే మధుమేహుల సంఖ్య అధికమనే సంగతి తెలిసిందే. ఈ ధోరణి ఇప్పుడూ అలాగే కొనసాగుతుండటమే కాదు.. ఇప్పటికే మధుమేహం ఉన్నట్టు గుర్తించినవారికన్నా అంతకు రెట్టింపు మందిలో మధుమేహం రాబోతున్న లక్షణాలు కనబడటం ఆశ్చర్యకరం! ప్రస్తుతం పట్టణాల్లో నివసిస్తున్న 25 ఏళ్లు దాటిన వారిలో 15% మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. వీరికి తోడు మరో 30-40% మందిలో మధుమేహం వచ్చే లక్షణాలు కనబడుతున్నట్టు తాజా సర్వేల్లో కనబడుతోంది. అంటే 25 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది మధుమేహంతో గానీ ముందస్తు మధుమేహంతో గానీ బాధపడుతున్నారని అర్థం. ఇక 40-64 వయసు వారిని తీసుకుంటే ఇది 75 శాతం ఉంటోంది. 65 ఏళ్లు దాటినవారిలోనైతే దాదాపు అందరిలోనూ (100 శాతం) మధుమేహం గానీ ముందస్తు మధుమేహం గానీ కనబడుతోంది. 2000లో హైదరాబాద్‌లోనే చేసిన అధ్యయనంలో 25 ఏళ్లు పైబడినవారిలో 16% మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 34% మందికి మధుమేహం వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని బయటపడింది. ఇదిప్పుడు మరింత పెరిగినట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి.
ప్రి డయాబెటీస్ అంటే?
సాధారణంగా మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. దీన్ని శరీరం శక్తిగా మార్చుకొని వినియోగించుకుంటుంది. ఇందులో క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ కీలకంగా పనిచేస్తుంది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినా, తగినంత విడుదల కాకపోయినా.. మన శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయినా రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. అయితే దీనికన్నా ముందు దశ ఒకటుంది. అదే ప్రి క్లినికల్ డయాబెటీస్. అందరూ దీన్ని దాటుకునే మధుమేహంలోకి అడుగుపెడతారు. ఈ ముందస్తు మధుమేహంలోనూ రక్తంలో గ్లూకోజు మోతాదు నార్మల్ కన్నా ఎక్కువగానే ఉంటుంది గానీ మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండదు. రక్తంలో గ్లూకోజు మోతాదు పరగడుపున 125 ఎంజీ/డీఎల్, భోజనం చేశాక 200 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువుంటే మధుమేహంగా గుర్తిస్తారు. అయితే ముందస్తు మధుమేహుల్లో గ్లూకోజు మోతాదు పరగడుపున 100 నుంచి 125 మధ్యలో (ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్-ఐఎఫ్‌జీ).. ఆహారం తీసుకున్న తర్వాత 140 నుంచి 200 మధ్యలో (ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్- ఐజీటీ) ఉంటుంది. ఈ రెండూ గానీ రెండింట్లో ఏ ఒక్కటి గానీ ఉన్నా 'ప్రి క్లినికల్ డయాబెటీస్' ఉన్నట్టే.
ఏమిటీ ముప్పు?
ఇంకా మధుమేహంగా మారలేదు కదా అని ప్రి డయాబెటీస్‌ను తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మధుమేహుల్లో కనిపించే సమస్యలే ముందస్తు మధుమేహుల్లోనూ.. పైగా అదే నిష్పత్తిలోనూ కనిపిస్తుండటం గమనార్హం. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి కొవ్వులతో పాటు అధిక రక్తపోటు ఎక్కువ కావటం వల్ల వచ్చే రక్తనాళాల సమస్యలు ముందస్తు మధుమేహుల్లోనూ ఉంటున్నాయి. గుండెజబ్బులు, పక్షవాతం, కాళ్లలో రక్తనాళాల సమస్యలు, నెఫ్రోపతీ, కంటి రెటీనాలో రక్తనాళాలు దెబ్బతినటం వంటివీ వీరిలో బయటపడుతున్నాయి.
మన శరీరంలోని చక్కెర అణువులు, పిండి పదార్థాలు.. ప్రోటీన్లను పట్టుకునే గ్త్లెకేషన్, గ్త్లెకాసిలేషన్ ప్రక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ ప్రక్రియల ద్వారా ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా.. ఈ ఆమ్లాలు తిరిగి ప్రోటీన్లుగా మారుతుంటాయి. మధుమేహుల్లో ఇలా చక్కెరను పట్టుకున్న (గ్త్లెకాసిలేట్) ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటమే కారణమని అనుకుంటున్నప్పటికీ.. గ్లూకోజు నార్మల్‌గానే ఉన్నా కొందరిలో గ్త్లెకాసిలేట్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే వీరిలోని మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు ఎక్కువగా గ్లూకోజును పట్టుకునే గుణం కలిగుండొచ్చు. మన శరీరంలోని కణాల లోపలా బయటా, రక్తంలో, జీర్ణకోశవ్యవస్థలో జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లు.. జీవక్రియ సంబంధ హార్మోన్లు.. శరీరానికి అత్యవసరమైన విటమిన్లు.. ఇవన్నీ కూడా ప్రోటీన్లే. ఇవి గ్త్లెకాసిలేట్ కావటం వల్ల మధుమేహుల్లో కనిపించే లక్షణాలు, సమస్యలన్నీ ముందస్తు మధుమేహుల్లోనూ బయటపడుతున్నాయి. మధుమేహుల్లో అధికస్థాయిలో ఉండే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, యూరిక్ యాసిడ్, హోమోసిస్టీన్ మోతాదులతో పాటు లైపోప్రోటీన్ ఎ అనే బయోమార్కర్లు కూడా వీరిలో పెరుగుతున్నాయి. ఫలితంగా వీరికి కూడా రకరకాల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటోంది.
కారణాలేంటి?
మధుమేహం రావటానికి వూబకాయం, జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్ర వంటివన్నీ దోహదం చేస్తాయి. అయితే ఇవేవీ లేకుండానే ప్రస్తుతం ముందస్తు మధుమేహం, మధుమేహం ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవజాత శిశువుల్లోనూ మధుమేహం (నియోనేటల్ డయాబెటీస్) పెరుగుతోంది. దీనికి ఇదమిత్థమైన కారణాలేంటో తెలియవు. లావుగా ఉండటం, ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం, మానసిక ఒత్తిడికి లోనుకావటం వంటివి దీనికి దోహదం చేస్తాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, కాలుష్యం, ప్లాస్టిక్ పరిశ్రమలు, క్రిమి సంహారక మందుల వంటివీ వీటికి తోడవుతున్నాయని అనుమానిస్తున్నారు. ఇవన్నీ కాకుండా వంటకు ఉపయోగించే కిరోసిన్, బొగ్గు, కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగలను పీల్చటమూ మధుమేహానికి దోహదం చేస్తోందని భావిస్తున్నారు. వీటిపై పరిశోధకులు దృష్టి సారించారు. కారణాలు ఏవైనప్పటికీ మధుమేహం ముమ్మరంగా విజృంభిస్తోందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
నియంత్రణ కీలకం
కాలుష్యం, జన్యుపరమైన అంశాల విషయంలో మనం చేయటానికేమీ లేదు. కానీ బరువు పెరగకుండా చూసుకోవటం, ఆహార నియమాలు పాటించటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం మూలంగా మధుమేహం ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు. ముందస్తు మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజు మరీ ఎక్కువగా ఉండదు కాబట్టి గ్లూకోజును తగ్గించే మందులివ్వటం కుదరదు. రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 కన్నా ఎక్కువ, భోజనం చేశాక 200 కన్నా ఎక్కువగా ఉంటే తగ్గించుకోవటానికి రకరకాల మందులున్నాయి. కానీ వీటిని ముందస్తు మధుమేహులకు ఇవ్వలేం. వీరికి గ్లూకోజు తగ్గించే మందులిస్తే కలిగే అనర్థాలపై అధ్యయనం జరగలేదు. అందువల్ల ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు పాటిస్తూ అదుపులో ఉంచుకోవటం మంచిది.
ఆహార నియమాలు: ముఖ్యంగా కొవ్వు పదార్థాలు.. మాంసాహార సంబంధ కొవ్వులైనా, శాకాహార సంబంధ కొవ్వులైనా.. తగ్గించుకోవాలి. దంపుడు బియ్యం, గోధుమలు, జొన్నలు తినటమూ మంచిదే. వీటిల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చూస్తాయి.
వ్యాయామం: రోజూ కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. అలాగని పెద్ద పెద్ద వ్యాయామాలే చేయాల్సిన అవసరం లేదు. వేగంగా నడవటం, సైకిల్ తొక్కటం, ఈత వంటి వ్యాయామాలు చేసుకోవచ్చు.
బరువు అదుపు: వూబకాయం మూలంగా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో కణాలు ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేవు. అందువల్ల ఆహారం, వ్యాయామం వంటి వాటితో బరువును అదుపులో ఉంచుకోవాలి.
రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటుకూ మధుమేహానికీ అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి అధిక రక్తపోటు గల ముందస్తు మధుమేహులు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే మందులూ వేసుకోవాలి.
ట్రైగ్లిజరైడ్లకు కళ్లెం: కొందరికి కొలెస్ట్రాల్ మామూలుగానే ఉన్నా రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉండొచ్చు. దీంతో గుండెజబ్బులు రావొచ్చు. రక్తనాళాలు దెబ్బతినొచ్చు. వీటి స్థాయి మరీ ఎక్కువైతే క్లోమగ్రంథి దెబ్బతిని 'పాంక్రియాటైటిస్' రావొచ్చు. కాబట్టి మందులతో ట్రైగ్లిజరైడ్లను అదుపులో ఉంచుకోవాలి.
లక్షణాలేవీ ఉండవు
ముందస్తు మధుమేహంలో ప్రత్యేకించి పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. 25 ఏళ్లు దాటిన వారిలో 15% మందికి మధుమేహం, మరో 30-40% మందికి ప్రి డయాబెటీస్ ఉండే అవకాశం ఉండటం వల్ల.. 25 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ ఏడాదికి ఒకసారైనా రక్త పరీక్ష చేయించుకోవటం మంచిది. ఇందులో గ్లూకోజు మోతాదు పెరుగుతున్నట్టు అనిపిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక ప్రయోగం
ముందుస్తు మధుమేహులకు మెంతులు, ఆహార నియమాలు, యోగా వల్ల కలిగే ఉపయోగాలపై నిమ్స్‌లో ఒక అధ్యయనం జరిగింది. మధుమేహాన్ని నివారించుకోవటానికి, మధుమేహం మూలంగా రక్తంలో కలిగే మార్పులు రాకుండా ఉండేందుకు ఇవి 30% వరకు ఉపయోగపడుతున్నట్టు వెల్లడైంది. అయితే ఈ ప్రభావం మూడేళ్ల వరకు మాత్రమే కనబడింది. ఆ తర్వాత మెంతులు తీసుకున్నవారికీ, ఆహార నియమాలు పాటించినవారికీ, యోగాసనాలు వేసినవారికీ, ఎలాంటి చికిత్స తీసుకోనివారికీ.. అందరికీ మధుమేహం వచ్చే అవకాశం ఒకే విధంగా ఉంటున్నట్టు బయటపడటం గమనార్హం.
చికిత్సల మార్గం
ప్రి డయాబెటీస్ గలవారికి మధుమేహులకిచ్చే మెట్‌ఫార్మిన్ మందును ఇతర దేశాల్లో చాలాచోట్ల ఇస్తున్నారు. ఇది రక్తంలో గ్లూకోజు ఎక్కువుంటే తగ్గిస్తుంది గానీ నార్మల్ కన్నా తగ్గించదు. ఇది ప్రి డయాబెటీస్ బాధితులను మధుమేహం బారినపడకుండా చూస్తున్నట్టు అక్కడి పరిశోధకులు గుర్తించారు. దీన్ని 250-500 మి.గ్రా. మోతాదులో రెండు పూటలా ఇచ్చి మంచి ఫలితాలు సాధించారు. రక్తంలో తలెత్తిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మార్పులనూ వెనక్కి మళ్లించగలిగారు. కానీ ప్రి డయాబెటీస్‌కు మెట్‌ఫార్మిన్ మందును వాడటంపై మనదగ్గర ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటివరకైతే దీన్ని ప్రి డయాబెటీస్ బాధితులకు ఇవ్వటం లేదు. అయితే మున్ముందు మనదగ్గరా త్వరలోనే దీన్ని వాడే అవకాశముంది. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదు మరింత పెరగకుండా, మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాగే మధుమేహానికి సంబంధించిన రక్తంలో మార్పులు (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటివి) పెరగకుండా ఉంటాయి.
* ఇతర దేశాల్లో రాసిగ్లిటజాన్ అనే మందు కూడా ఇస్తున్నారు. కానీ దీన్ని గుండెజబ్బు గలవారికిస్తే ఒంట్లో నీరు పోగుపడటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అందువల్ల మనదేశంలో దీన్ని వాడటం లేదు. ఈ మందును వాడాలంటూ నిపుణులు కూడా సలహా ఇవ్వటం లేదు.
* అకార్బోజ్, ఓగ్లిబోజ్, మిగ్లిటాల్ మందులు కూడా మధుమేహం రాకుండా చేస్తున్నట్టు ఇతర దేశాల్లో గుర్తించి వాడుతున్నారు. వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మున్ముందు వీటిని ఇక్కడా ఆరంభించే అవకాశముంది.
* గ్లిప్టిన్స్: మనదేశంలోనూ త్వరలోనే ఈ రకానికి చెందిన ఒక మందును ముందస్తు మధుమేహులకిచ్చి ప్రయోగపరీక్షలు చేయనున్నారు.
విజయం తథ్యం!
మధుమేహానికి సంబంధించిన యాంటీబోడీ పరీక్షలు అందుబాటులోకి వస్తే రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవటమనేది దాదాపు కనుమరుగైపోతుందని చెప్పొచ్చు. వీటి ద్వారా ముందస్తు మధుమేహాన్ని చాలా ఏళ్లకు ముందే గుర్తించొచ్చు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఈ యాంటీబోడీలు పదేళ్ల ముందునుంచే కనిపించటం ఆరంభిస్తాయి. ఇవి క్రమక్రమంగా క్లోమగ్రంథిలోని బీటా కణజాలాన్ని నాశనం చేస్తుంటాయి. ఒకవేళ ఈ యాంటీబోడీల పరిమాణాన్ని తగ్గించుకోగలిగితే బీటా కణాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అప్పుడు ముందస్తు మధుమేహం గానీ మధుమేహం గానీ వచ్చే అవకాశమే ఉండదన్నమాట. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఇవ్వటం కుదరదు. దుష్ప్రభావాలు లేకుండా, రోగనిరోధకశక్తిని తగ్గించకుండా పనిచేసే కొత్త మందులు అందుబాటులోకి వస్తే.. ఈ యాంటీబోడీ పరీక్షలతో ముప్పును గుర్తించి అసలు మధుమేహం రాకుండానే చూసుకునే అవకాశముంది. అప్పుడు మధుమేహంపై పూర్తిగా విజయం సాధించటం తథ్యం అనుకోవచ్చు.
నిర్ధారణ ఎలా?
రక్త పరీక్షల ద్వారా ముందస్తు మధుమేహాన్ని గుర్తిస్తారు. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ (ఎఫ్‌పీజీ), ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ), గ్త్లెకేటెడ్ హీమోగ్లోబిన్ (హెచ్‌బీఏ1సీ) పరీక్షలతో దీన్ని నిర్ధరిస్తారు. ఎఫ్‌పీజీ, ఓజీటీటీ చేయించుకోలేనివారు హెచ్‌బీఏ1సీ పరీక్ష ఒకటే చేయించుకుంటే సరిపోతుంది.
ఎఫ్‌పీజీ: దీన్ని నిద్ర నుంచి లేచాక పరగడుపుననే చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజు మోతాదు 100-125 ఎంజీ/డీఎల్ ఉంటే ముందుస్తు మధుమేహంగా గుర్తిస్తారు.
ఓజీటీటీ: ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత దీన్ని చేస్తారు. గ్లూకోజు మోతాదు 140-200 ఎంజీ/డీఎల్ ఉంటే ముందస్తు మధుమేహం ఉన్నట్టే.
హెచ్‌బీఏ1సీ: మూడు నెలల సమయంలో సగటున రక్తంలో గ్లూకోజు మోతాదు ఎంత ఉందనేది ఇందులో బయటపడుతుంది. ఇది 5.7 నుంచి 6.5 మధ్య ఉన్నట్టయితే ప్రి డయాబెటీస్‌గా గుర్తిస్తారు. దీన్ని రోజులో భోజనానికి ముందు, తర్వాతా ఎప్పుడైనా చేయించుకోవచ్చు.
* అవసరమైతే రక్తంలో యూరిక్ యాసిడ్, హోమోసిస్టీన్, లైపోప్రోటీన్-ఏ.. అలాగే మూత్రంలో మైక్రో అల్బుమినూరియా పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. వీటిల్లో కిడ్నీజబ్బు వంటి ఇతరత్రా సమస్యలు తలెత్తుతుంటే ముందుగానే గుర్తించొచ్చు.
భవిష్యత్తు పరీక్షలు
ప్రి డయాబెటీస్, మధుమేహాన్ని చాలా ముందుగానే గుర్తించేందుకు మున్ముందు మరింత అధునాతన పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.
* గ్త్లెకాసిలేటెడ్ ప్రోటీయోం: ఇది మరింత కచ్చితమైన, అధునాతనమైన పరీక్ష. హెచ్‌బీఏ1సీలో 90 రోజుల కాలంలో జరిగిన మార్పులు తెలుస్తాయి. ఇందులోనైతే 15 రోజుల్లో జరిగిన మార్పులూ బయటపడతాయి. అందువల్ల దీంతో మరింత కచ్చితంగా గ్లూకోజు తీరుతెన్నులను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరీక్ష అందుబాటులో లేదు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
* ప్రస్తుతం ఎడిపోనెక్టిన్, ప్లాస్మినోజన్ యాక్టివేటార్ ఇన్‌హిబిటార్, ప్రొ-బీఎన్‌పీ, సీ రియాక్టివ్ ప్రోటీన్ పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముందస్తు మధుమేహుల విషయంలో వీటిని చేయటం లేదు. ఇప్పుడివి ముందుస్తు మధుమేహులకూ చేయాల్సిన అవసరం తలెత్తుతోంది. ఈ బయోమార్కర్లు ఉన్నట్టు తేలితే మధుమేహ సంబంధ సమస్యలు రావొచ్చని ముందుగానే పసిగట్టే వీలుంది.
* యాంటీబోడీ పరీక్షలు: భవిష్యత్తులో ఈ పరీక్షలే కీలకం కానున్నాయి. వీటిల్లో గ్యాడ్ యాంటీబోడీ, ఇన్సులిన్ యాంటీబోడీ, ఐలెట్ సెల్ యాంటీబోడీ, జింక్ ట్రాన్స్‌పోర్టర్ యాంటీబోడీ పరీక్షలు ముఖ్యమైనవి. ఇవి పాంక్రియాస్ బీటా కణాలకు సంబంధించిన పనితీరును తెలియజేస్తాయి. రక్తంలో గ్లూకోజు, బయోమార్కర్లు మామూలుగానే ఉన్నా.. ఇవి రాబోయే మార్పులను చాలా ముందుగానే తెలియజేస్తాయి. నిజానికి మధుమేహం బారినపడ్డవారికి పదేళ్ల ముందు నుంచే ఈ యాంటీబోడీలు పాజిటివ్‌గా ఉంటాయి. అంటే రక్తంలో గ్లూకోజు నార్మల్ కన్నా పెరగకముందే, బయోమార్కర్ల ఆనవాళ్లు కనిపించకముందే వీటి ద్వారా మధుమేహాన్ని, మధుమేహం మూలంగా వచ్చే సమస్యలను చాలాకాలం ముందుగానే గుర్తించే అవకాశముంది.
* అలాగే థైరాయిడ్ పెరాక్సిడైజ్ యాంటీబోడీ, థైరోగ్లోబ్లిన్ యాంటీబోడీ.. చిన్నపేగులకు సంబంధించిన యాంటీబోడీ అయిన టిష్యూ ట్రాన్స్ గ్లుటామినేజ్ పరీక్షలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి.
0 Comments