Full Style

>

భ్రూణ లింగనిర్థారణ నిషేధ చట్టం , Pre-natal sex diagnostic Act.



భ్రూణ లింగనిర్థారణ నిషేధ చట్టం అందుబాటులో ఉన్నా.. సక్రమంగా అమలుకు నోచుకోకపోవడమే అసలైన కారణం. ఇంతకీ ఆ చట్టం ఏం చెబుతోందంటే?

పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా అని తెలుసుకోవడం.. అమ్మాయైతే భారమనుకొని నిర్ధాక్షిణ్యంగా గర్భస్రావం చేయించుకోవడం ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో కొనసాగుతోన్న మూర్ఖత్వం. కాబోయే తల్లికి అమ్మాయిని కనాలని మనసులో ఉన్నా... మిగతా కుటుంబ సభ్యుల ప్రోద్భలం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, వరకట్నం వంటివన్నీ అమ్మాయి వద్దనుకునేలా చేస్తున్నాయి. ఇదే నిజం.. అమ్మాయని తెలియగానే అంతం చేసే పరిస్థితిలో మార్పు రాలేదని గణాంకాలూ నిరూపిస్తున్నాయి.

మన జనాభా లెక్కలు 1991 ప్రకారం.. (0-6 ఏళ్లలోపు పిల్లల్లో) అమ్మాయిల సంఖ్య 945. అది 2001 నాటికి ఇంకా తగ్గింది. వెయ్యిమంది అబ్బాయిలుంటే.. అమ్మాయిల సంఖ్య 927 కు దిగజారింది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.

చట్టం నుంచి రక్షణ...
అమ్మాయిలను వద్దనుకుని వదిలించుకునే వారిని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1994లో లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (ప్రీనాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అబ్యూస్‌) యాక్ట్‌ 1994) రూపొందించింది. గర్భిణులకు చేసే స్కానింగ్‌ కేవలం.. పుట్టబోయే పిల్లల్లో ఉన్న జన్యుపరమైన అవకరాలను గుర్తించడానికేనని తేల్చిచెప్పింది. దీన్ని ఉల్లంఘిస్తే యాభై వేల రూపాయల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష తప్పనిసరని పేర్కొంది.



వైద్యులూ భాగమే
వైద్యులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. దాని ప్రకారం ప్రతి నర్సింగ్‌ హోమ్‌ని కచ్చితంగా రిజిస్టర్‌ చేయాలి. అలాగే భ్రూణ పరీక్షలో అమ్మాయా, అబ్బాయా అన్నది తెలిసినప్పుడు వైద్యులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు, ఇతరులకు చెప్పడం నేరం అవుతుంది. చట్టం వచ్చి ఇన్నేళ్లయినా అమలులో ఆటంకాలు. ఫిర్యాదులు స్వల్పం. కేసులు నత్తనడక.

ఈ చట్టానికి సంబంధించి 2001లో ఓ వాజ్యం దాఖలైంది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు వరసగా కొన్ని నెలలు అమలు తీరుని పర్యవేక్షించింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా.. తమ నియమాలను సవరించి, లింగ నిర్థారణ పరీక్ష జరిపించే వైద్యులను వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డ వారిగా పరిగణించాలని నిర్ణయించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆస్పత్రులను డీరిజిస్టర్‌ చేసి, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని 2002లో సవరించిన నియమాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ చట్టాలకు తోడు సెక్షన్‌ 312 ఐపీసీ ప్రకారం అక్రమ గర్భస్రావం చేయించడమూ నేరం. దాన్ని గోప్యంగా ఉంచడమూ సెక్షన్‌ 120 ప్రకారం నేరం. పుట్టకముందే లింగనిర్ధారణ చేయించే అధికారం ఎవరికీ లేదని 2002లో చేసిన సవరణలో స్పష్టం చేశారు. అప్పటినుంచి ఈ చట్టం 'ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీనాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌ 2002'గా మారింది.

వెసులుబాటు లేదు...
ఈ చట్టం నుంచి వెసులుబాటు కోరుతూ కోర్టులను ఆశ్రయించిన వారున్నారు. ఈ చట్టం నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ 2002లో ముంబై హైకోర్టులో కొందరు రిట్‌ పిటిషన్‌ వేశారు. ఒకరిద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా అనుమతించాలని.. కుటుంబాన్ని ప్లాన్‌ చేసుకునే స్వతంత్రం కల్పించాలనీ ఓ జంట వాదించింది. అంటే అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండి... మూడో సంతానం మగపిల్లవాడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు గనుక తెలుసుకునే వీలు కల్పించాలనేది వారి వాదన. ఈ భావనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కేసును కొట్టి వేసింది. 'ఆడపిల్లల పట్ల వివక్ష ఉన్న మనదేశంలో లింగనిర్ధారణ పరీక్షలు చట్టబద్ధం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. నిజానికి అలా జరిగేవన్నీ హత్యలే' అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Post a Comment

0 Comments