Full Style

>

 హోర్మోనల్ డిస్క్ సమస్యల నుంచి హోమియోతో విముక్తి

 హోర్మోనల్ డిస్క్ సమస్యల నుంచి హోమియోతో విముక్తి

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, ఆధునికత తెచ్చిపెట్టిన సుఖాలు మనిషి దైనందిన జీవితాన్ని ప్రమాదకర స్థాయిలో అనారోగ్యంలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా శరీరాన్ని కాపాడే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్యాలు చిన్న వయసులోనే మీదనపడుతున్నాయి. ఈ కోవలోనే డిస్క్ సమస్యలు ఏర్పడుతున్నాయి. హోమియో చికిత్సతో డిస్క్ సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను
కొన్ని రకాల ఎముకల అమరికతో ఏర్పడిన వెన్నుపూసలో రకరకాల ఒత్తిళ్లను తట్టుకోవడానికి, సంబంధిత రక్తనాళాలు, నరాలు మొదలైనవి వెలుపల, లోపలకు చేరడానికి ప్రత్యేకమైన డిస్క్ నిర్మాణాలతో కూడి ఉంటుంది. అయితే జీవక్రియ సమతుల్యత లోపించడం ప్రారంభమైనపుడు రకరకాలుగా శరీర అవయవాలు స్పందించడం జరుగుతుంటుంది. పెరుగుతున్న మానసిక, శారీరక ఒత్తిడికి గురికావడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి డిస్క్ సమస్యలు తలెత్తుతాయి.
ఎవరిలో ఎక్కువగా?
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హార్మోనల్ డిస్క్ సమస్యలు స్త్రీ పురుషులనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్య వయస్కులలో ఈ లక్షణాలు బయటపడడం రకరకాల ప్రేరేపక అంశాల తార్కాణంగా చెపుకోవచ్చును. సాఫ్ట్‌వేర్, బ్యాంకు ఉద్యోగస్తులు, థైరాయిడ్, డయాబెటిస్‌తో బాధపడేవారు, ఒబేసిటి, అలర్జీ, ఆస్తమాలతో నిరంతరం రోగ నిరోధక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న వారు, తరచు యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ వారిన పడేవారు, నెలసరి సమస్యలు, హార్మోనల్ సమస్యలతో బాధపడేవారు, ఆర్థరైటిస్ లక్షణాలు చిన్నతనంలోనే ఉన్నవారిలో డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
ముఖ్య లక్షణాలు
డిస్క్ సమస్యలు జరిగిన నష్టాన్ని బట్టి రకరకాలుగా బయటపడతాయి. డిస్క్‌లలో సహజంగా ఉండే బలం తగ్గి అరిగినపుడు ఆర్థరైటిస్‌ని పోలిన లక్షణాలు ఏర్పడతాయి. అలాగే డిస్క్‌లు ఉండాల్సిన నిర్మాణంలో నుండి తప్పుకుని పక్కకు జరగడం వల్ల సంబంధిత నరాలు, రక్తనాళాలపై ఒత్తిడిపడి రకరకాల లక్షణాలకు దారితీయవచ్చు. డిస్క్‌లు త్వరగా శిథిలం కావడం వల్ల ప్రారంభమయ్యే లక్షణాలు వెన్నెముకలో సంభవించే ప్రదేశాన్ని బట్టి స్పాండిలైటిస్ లక్షణాలుగా బయటపడతాయి. డిస్క్‌లు పక్కకు జరగడం వల్ల సాధారణ నొప్పి నుండి విపరీతమైన నొప్పికి దారితీస్తుంది. నరాలు, సంబంధిత కండరాలపై ఒత్తిడి వల్ల నొప్పి ఒక చోట అంటే మెడ లేదా నడుములో ప్రారంభమై చేతులు లేదా కాళ్లలోకి వ్యాపించవచ్చు.
కొంతమందిలో కేవలం కాళ్లు లేదా చేతులలో మాత్రమే నొప్పి ఉండవచ్చు. అలాగే స్పర్శలో మార్పులు జరిగి తిమ్మిర్లు, దురదలు, కండరాల బలహీనత, పక్షవాతం లక్షణాలు మొదలైనవి కనిపించవచ్చు. నడుం కింది భాగంలో డిస్క్ సమస్యల వల్ల సియాటిక లక్షణాలు అంటే కాళ్లు లాగటం, భంగిమను బట్టి విపరీతమైన నొప్పి, మంట ఉండటం జరగవచ్చు. అలాగే ఎల్3 లేదా ఎల్5 సమస్యలు ఉన్నవారు లైంగిక సమస్యల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాని, డిస్క్‌ల ఒత్తిడి, నిర్మాణ మార్పులను బట్టి సమస్యలు మారుతుండడం జరగవచ్చు. హార్మోన్ల అసమతుల్యత ప్రభావం వల్ల త్వరగా అలసిపోవడం, నోరు ఎండిపోవడం, నిస్పృహ, ఆందోళన, కండరాలు వంకర్లు పోవడం, నిద్రలేమి, నిరంతరం ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి తలెత్తి డిస్క్ సమస్యలతోపాటు ఉండవచ్చు.
వ్యాధి నిర్ధారణ
హార్మోనల్ డిస్క్ సమస్యలను సంబంధిత ప్రేరేపకాల అంశాలను తెలుసుకోవడానికి రోగికి చెందిన అనారోగ్య చరిత్రను పరిశీలించడం ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అవసరాన్ని బట్టి ఎక్స్‌రే, సిటి స్కాన్, ఎంఆర్ఐ, మైలోగ్రామ్, డాప్లర్ స్టడీ మొదలైన పరీక్షలతోపాటు ఇఎస్ఆర్, సిబిపి, సిఆర్‌పి, ఆర్ఎ, ఇజిఇ, బ్లడ్ కాల్షియం వంటి రక్తపరీక్షలతోపాటు హార్మోనల్ అనాలిసిస్ కూడా అవసరం పడవచ్చు. తద్వారా తీసుకోవలసిన జాగ్రత్తలు అంటే సంబంధిత ఒత్తిడిని తొలగించే విధానాలను సూచించవచ్చును. ఎముకల శిథిల వ్యవస్థను గుర్తించడానికి బోన్ డెన్సిటి పరీక్ష, బయాప్సి మొదలైనవి ఉపయోగపడతాయి.
హోమియో వైద్యం
సంబంధిత రోగ లక్షణాలను బట్టి రోగి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలను నిశితంగా పరిగణనలోకి తీసుకుని, ఇంటా బయటా రోగి మానసిక, శారీరక ఒత్తిడి అవలంబన విధానాలు, ఏ సమయంలో రోగ లక్షణాలు ఎక్కువవుతాయో, ప్రేరేపక అంశాల పాత్ర, వాడుతున్న మందుల దుష్ప్రభావాలు, వంశపారంపర్యత వంటి అంశాల ప్రాతిపదికన చేసే హోమియో వైద్యంతో డిస్క్ సమస్యల నుండి బయటపడవచ్చును. సరైన వ్యాయామం, ఆహారపు అలవాట్లు, పోషక పదార్థాలు, విశ్రాంతి వంటి జాగ్రత్తలతో త్వరగా ఆరోగ్యవంతులుగా చేయడం సులభం. అయితే వైద్యులు సూచించిన మందులు సమయానుసారంగా వాడటం తప్పనిసరి. హోమియో వైద్యం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

Post a Comment

0 Comments