Full Style

>

దృష్టి తీక్షణత ఎలా ఉండాలంటే...

‘చందమామ రావే, జాబిల్లి రావే’ అని అంటూ దూరంగా ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులుపోయాయి. టీ.వీ.లోనూ, కంప్యూటర్‌లోను, సెల్‌ఫోన్లు చూపిస్తూ పిల్లలకు అన్నం తినిపించే రోజులు వచ్చాయి. ఈ విధంగా దూరంగా చూసే అలవాటు పోయి దగ్గరలోనే చూస్తుండడం వలన పిల్లలకు దూరపు చూపు తగ్గే ప్రమాదం ఉంది. దృష్టి అంటే చూడగలగడం. దృష్టి తీక్షణత ఎలా ఉండాలం టే దూరంగా చూడగలగాలి. క్షేత్రదృష్టి కలిగి ఉండాలి. రంగులన్నీంటిని గుర్తించ గలగాలి మసక వెలుతురులోనూ చూగ గలగాలి అంటే రే చీకటి లేకుండా ఉండాలి. ఈ విధంగా దూరదృష్టి హ్రస్వ దృష్టి, క్షేత్ర దృష్టి, వర్ణ దృష్టి కలిగి ఉంటూ రేచీకటి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణమైన దృష్టిని కలిగి ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో టీవీలను, కంప్యూటర్లను ఎక్కువసేపు అంటే పెట్టుకొని ఉంటూ, అపార్ట్‌మెంట్లలో (దూరంగా చూసేందుకు అవకాశమే లేకుండా ఉంటున్నాయి). జీవనం కొనసాగిస్తూ, కార్పోరేట్‌ స్కూళ్ళకు (ఎక్కువ సేపు తరగతి గదులకు అంకితమైపోయి ఉండడం) పరిమితమై ఉన్న విద్యార్థుల్లోనే ఎక్కువ మంది హ్రస్వ దృష్టిని కలిగిన వారు ఉన్నట్లుగా గణాంకాలు తెలియ చేస్తున్నాయి. అంటే వీరిలోనే ఎక్కువ మందికి దూరపు చూపు కనిపించుటలేదు. దీనికి కారణం దూరపు చూపును అశ్రద్ధ చేస్తూ ఎక్కువ సమయం దగ్గర చూపుపైనే తీక్షణత చూపడమే.

దృష్టిదోషం కలిగి ఉన్నట్లు గుర్తించిన తరువాత నేత్ర వైద్యులు సూచించిన కళ్ళద్దాలు వాడకపోవడం, వీక్‌ ఎండ్స్‌, చాట్‌ బండ్స్‌ అంటూ ఫాస్ట్‌ ఫుడ్స్‌ తింటూ పోషకాహారం తీసుకోవడంలో అశ్రద్ధ చేయడం, టీ.వీ.కి దగ్గరగా కూర్చొని చూడడం, పుస్తకాలు కళ్ళకు బాగా దగ్గరగా పెట్టుకొని చదవడం, సరైన వెలుతురులో చదవకపోవడం, కొన్ని జన్యుపరమైన కారణాలు పిల్లల్లో చూపు తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. రేచీకటిని గుర్తించిన వెంటనే వైద్యం చేయించుకోకపోవడం.

అంతరకుశమాలను (కేటరాక్టు) గుర్తించిన వెంటనే శస్తచ్రికిత్స చేయించుకోకపోవడం, నీటి కాసుల వ్యాధి (ఈ వ్యాధి గల వారికి క్షేత్ర దృష్టి తగ్గిపోతుంది) గల వారు తగు చికిత్స కొనసాగించకపోవడం, మధుమేహం, రక్తపోటు ఎక్కువగా ఉన్న వారు వెంటనే నేత్ర వైద్యుని సంప్రవించకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో నేత్ర వ్యాధులకు ఆకు పసరులు వాడడం లాంటి మూఢ పద్ధతులు వాడడం, మెల్లకన్ను ఉండటం అదృష్టం అని భావిస్తూ శస్త్ర చికిత్స చేయించుకోకపోవడం లాంటివి పెద్దల్లో చూపు తగ్గిపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
వీటన్నింటికి కారణం నేత్ర ఆరోగ్య విద్యపై సరైన అవగాహన లేకపోవడమే. అందుచేత మనం అందరం ప్రజల్లో నేత్ర ఆరోగ్యంపై అవగాహన కల్పించి కన్ను దృష్టిని కాపాడుదాం. ముందుచూపుతో కంటి చూపును కాపాడుదాం.

Post a Comment

0 Comments